మదనపల్లె టౌన్: కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. శనివారం ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా మదనపల్లెలోని జిల్లా ఆస్పత్రి నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూలై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘పిల్లల మధ్య వ్యవధి పాటిద్దాం – ఆరోగ్య వంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం’అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాటారు. జిల్లా ఆస్పత్రి నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 104 నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, యూపీహెచ్‌సీ వైద్యులు ఫరాఖాన్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్‌ఓ ఓబుల్ రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
‘సర్’ ప్రక్రియ వేగవంతం
● డిజిటలైజేషన్‌కు మిగిలింది
1.84 లక్షల ఓటర్లే
● పెండింగ్‌లో పంపిణీ ఫారాలు 468
సాక్షి, మదనపల్లె: జిల్లాలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్) ప్రక్రియ వేగం పుంజుకుంది. జిల్లాలో 12,32,439 మందికి ఓటర్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు 12,31,971 మందికి (99.96 శాతం) పంపిణీ చేశారు. వీటిలో 10,47,610 ఓటర్ (85 శాతం) ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఓటరు ఫారాలు ఇంకా 468 పంపీణీ చేయాల్సి ఉండగా, 1,84,829 ఫారాల డిజిటలైజేషన్ మిగిలి ఉంది. ఈనెల ఎనిమిదవ తేది నుంచి 11వ తేది మధ్యలో 3,85,758 ఫారాలు డిజిటలైజేషన్ అయ్యాయి. సర్ కార్యక్రమం ముగిసేందుకు ఇక మిగిలింది కేవలం మూడురోజులే కావడంతో అధికార యంత్రాంగ ఏ మేరకు పూర్తి చేస్తుందో చూడాలి. ఫారాల పంపిణీ విషయంలో మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో వంద శాతం పూర్తి చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఫారాల డిజటలైజేషన్ విషయంలో రాయచోటి నియోజకవర్గం 87.47 శాతంతో ముందుంది, 83.09 శాతంతో పీలేరు నియోజకవర్గం వెనుకబడింది. ఫారాల పంపీణీలో నాలుగు మండలాలు మినహా మిగిలిన 21 మండలాల్లో వందశాతం పంపీణి పూర్తి చేశారు.


