మదనపల్లె టౌన్ : మదనపల్లెలో భారీగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణంలోని అప్పారావు తోటలో ఉన్న పలు గోడౌన్లపై శనివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.లక్షల విలువైన కూల్ లిప్స్, గుట్కా, పాన్ పరాగ్, ఖైనీ తదితర మత్తు ఇచ్చే ఇతర ప్యాకెట్లు పెద్ద ఎత్తున పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూల్ లిప్స్ పెద్ద ఎత్తున విక్రయిస్తున్న వారిలో నవీన్ మరికొందరు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారి దుకాణాలలోనే 60 బస్తాల కూల్ లిప్స్ పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.2 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కూల్ లిప్స్, నిషేధిత గుట్కా, పాన్ పరాగ్‌లను లెక్కిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను ప్రెస్ మీట్‌లో వెల్లడిస్తామని తెలిపారు. ఈ దాడులకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు.


