మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలోని కంటేవారిపల్లె సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఘటనపై ముదివేడు ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. బి.కొత్తకోట పాశం వీధికి చెందిన నరసింహులు కుమారుడు రాజేంద్ర(37) మదనపల్లెలో లారీ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. రోజూ మాదిరిగానే మదనపల్లెకు వచ్చి విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి బైకుపై తిరిగి ఇంటికి వెళుతుండగా, మార్గంమధ్యలోని కంటేవారిపల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన భర్త మృతి చెందడంతో కుటుంబం వీధిన పడ్డట్లయిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.


