● అందుబాటులో అవసరమైన ఎరువులు
● జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణశర్మ
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో రైతులకు అవసరమైన మేరకు యూరియా, డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ స్పష్టం చేశారు. శనివారం మదనపల్లె కలెక్టరేట్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 8వ తేదీ నుంచి ఈఎల్‌ఏఎంఎస్ 2.0 యాప్ ద్వారా జిల్లాలో యూరియా, డీఏపీ పంపిణీ జరుగుతోందన్నారు. ఈ వ్యవస్థ ఈ–క్రాప్ ద్వారా నమోదైన పంట వివరాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాసీ్త్రయ సిఫారసుల ఆధారంగా రైతులకు అవసరమైన ఎరువులను కేటాయిస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. జూన్ 8 నుంచి ఏపీఏఐఎంఎస్ 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభమైందని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 16,056 మంది రైతులకు 1,389.24 మెట్రిక్ టన్నుల యూరియా, 172.60 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా, డీఏపీ కొనుగోలు చేయడానికి ముందుగా ఈ–క్రాప్‌లో నమోదై ఉండాలని, ఏపీఏఎంఎస్ మాడ్యూల్‌లో గత రబీ 2025 నాటి ఈ–క్రాప్ వివరాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి ధ్రువీకరణ పూర్తి చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేట్ రీటైల్ దుకాణాల ద్వారా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సమావేశంలో జేడీ తదితరులు పాల్గొన్నారు.


