● జిల్లాలో 20కి చేరిన మరణాలు
● ప్రొద్దుటూరులోనే
ఐదుగురు బలవన్మరణం
● ఫ్యాక్టరీలు మూతపడ్డా.. హోల్‌సేల్,
రిటైల్ దుకాణాల్లో ఆగని అమ్మకాలు
ప్రొద్దుటూరు క్రైమ్: వైఎస్సార్ జిల్లాలో కల్తీ కళ్లాపి (పేడ) రంగు పొడి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. నకిలీ కెమికల్ తయారీ కేంద్రాలపై ఇటీవల జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపి ఐదు ఫ్యాక్టరీలను సీజ్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే, ప్రొద్దుటూరు వివేకానందనగర్‌కు చెందిన బత్తల సుమంత్ (33) కుటుంబ కలహాలు, కోర్టు వివాదాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై శనివారం తెల్లవారుజామున అదే రంగు ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో కళ్లాపి పౌడర్ తాగి 19 మంది చనిపోయినట్లు ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ఇటీవల వెల్లడించగా, తాజా ఘటనతో జిల్లాలో మరణాల సంఖ్య ఏకంగా 20కి చేరింది. ప్రొద్దుటూరు పట్టణంలోనే ఈ బలవన్మరణాల సంఖ్య ఐదుకు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది.వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులోని ఫ్యాక్టరీల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లకు పెద్ద ఎత్తున పేడరంగు పొడి సరఫరా అయింది. దీంతో ఇక్కడి హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో వీటి నిల్వలు ఇంకా భారీగా ఉన్నాయి. అధికారులు కేవలం తయారీ కేంద్రాలను (ఫ్యాక్టరీలను) సీజ్ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప.. మార్కెట్ లో ఉన్న నిల్వలను స్వాధీనం చేసుకోవడం, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించడం లాంటి పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే కిరాణా షాపుల్లో వీటి విక్రయాలు ఇంకా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఐదు రోజుల క్రితమే అధికారులు దాడులు చేసి, అనుమతుల్లేకుండా నడుస్తున్న పరిశ్రమల నుంచి పేడ రంగు పొడి తయారీలో వాడే వెయ్యి కిలోల ‘ఆరమైన్–ఓ’ అనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనాన్ని, మూడు వేల కిలోల కల్తీ పౌడర్‌ను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.


