ఫేస్‌ యాప్‌తో ఫేక్‌కు ఫుల్‌ స్టాప్‌ | - | Sakshi
Sakshi News home page

ఫేస్‌ యాప్‌తో ఫేక్‌కు ఫుల్‌ స్టాప్‌

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

ఉపాధి హామీలో మోసాలకు కళ్లెం

దొంగ మస్టర్లకు తావు లేదు

బినామీ కూలీలకు చెక్‌

మదనపల్లి (కురబలకోట) : ఉపాధి హామీలో ఏళ్లుగా వేళ్లూనుకుపోయిన అక్రమాలకు కేంద్రం ఫేస్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌ ద్వారా అడ్డుకట్ట వేసింది. ఒకరు పనిచేసి మరొకరు వేతనాలు తీసుకోవడం, బినామీ కూలీలతో దొంగ మస్టర్లు సృష్టించడం, నకిలీ జాబ్‌ కార్డుల ద్వారా నిధులు దుర్వినియోగం చేయడం లాంటి అక్రమాలు, అవినీతి, అవకతవకలకు దాదాపుగా అడ్డుకట్ట పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఇదివరలో ఒకరు పనిచేస్తే మరొకరి పేరుతో బిల్లులు చేసుకుని స్వాహా చేసేవారు. ఇది అధికార యంత్రాంగానికి సవాలుగా మారేది. సోషల్‌ ఆడిట్‌లో కూడా దొరక్కుండా జాగ్రత్త వహించేవారు. ఫీల్డ్‌ అసిస్టెంట్లు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు పరస్పరం కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడేవారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో కట్టుదిట్టం అయ్యింది. ఉదయం పనిలోకి వెళ్లగానే ఒక సారి నాలుగు గంటల వ్యవధిలో మరో సారి ఫేస్‌ యాప్‌ ఫొటోలు తీస్తున్నారు. దీంతో పని చేసిన వారికే ఉపాధి హామీ కూలి సొమ్ము లభిస్తోంది. బీనామీ మస్టర్లకు చెల్లు చీటి పడింది. ఇది అమల్లోకి వచ్చిన తొలి రోజుల్లో యాప్‌ కష్టాలు తలెత్తినా క్రమేణా తగ్గిపోయాయి. ఈకైవెసీ పెండింగ్‌ వల్ల ఫొటో అఫ్లోడ్‌లో సమస్యలు తలెత్తాయి. అవన్నీ కూడా తొలగిపోయాయి.

జిల్లాలో రోజుకు 49 వేల మంది హాజరు..

అన్నమయ్య జిల్లాలోని 25 మండలాల్లో రోజుకు 49,252 మంది కూలీలు పనులు చేస్తున్నట్లు జిల్లా పీడీ వెంకటరత్నం వెల్లడించారు. జిల్లాలో లక్ష 72 వేలు జాబ్‌ కార్డులు ఉన్నాయి. వీటిలో లక్ష 43 వేలు జాబ్‌ కార్డులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఫేస్‌ యాప్‌ వల్ల తాత్కాలికంగా 20 నుండి 30 శాతం కూలీల సంఖ్య తగ్గినా క్రమేణా పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక వైపు టమాటా సాగు, ఇంకో వైపు నేరేడు మరో వైపు సకాలంలో బిల్లులు పడకపోవడం కూడా కూలీల సంఖ్య తగ్గడానికి మరో కారణంగా జనం భావిస్తున్నారు. సర్వర్‌, సిగ్నల్స్‌ సమస్యలు తలెత్తినప్పుడు హాజరు నమోదుకు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టే అవకాశం కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement