పుంగనూరు : మండల పరిధిలోని రాగానిపల్లెలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాగానిపల్లె గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి (67) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుడి మరణానికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
మహిళకు పాము కాటు
మదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తున్న మహిళను విషసర్పం కాటేసిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని కురవూరుకు చెందిన రైతు ఏ. వెంకటరమణ భార్య ఏ. మునెమ్మ (60), ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బోరు వద్ద టమోటా చెట్లలో కాయలు కోస్తోంది. ఆ సమయంలో చెట్ల మధ్య ఉన్న నాగుపాము మునెమ్మ కాలిపై కాటేసింది. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు బాధితురాలిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ దూలంవారిపల్లి రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన అహమద్ (30), మౌలా (35)లు ద్విచక్ర వాహనంలో కర్నాటక రాష్ట్రం చేలూరుకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో కందుకూరు మీదుగా వెళుతుండగా దూలంవారిపల్లి రోడ్డులో ఎదురుగా వస్తున్న ఓ కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులకు తీవ్ర రక్త గాయాలు కావడంతో క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


