మమ్మల్ని కాపాడితే పార్టీ బతుకుతుంది | - | Sakshi
Sakshi News home page

మమ్మల్ని కాపాడితే పార్టీ బతుకుతుంది

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

ఏం చేశారని ఈ సమావేశాలు

ఎమ్మెల్యే సమక్షంలో కార్యకర్తల ఆగ్రహం

సాక్షి, మదనపల్లె : పార్టీ కోసమని అంటున్నారు..పార్టీ అంటే కార్యకర్తలే కదా, ఆ కార్యకర్తల బాగోగులు పట్టించుకోకుండా..అది చేయండి, ఇది చేయండి అంటే ఎలా అంటూ టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మదనపల్లి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తల సమావేశాలు నాలుగు చోట్ల జరిగాయి. మదనపల్లె పట్టణానికి సంబంధించి ఎమ్మెల్యే కార్యాలయంలో, మదనపల్లి రూరల్‌ సంబంధించి ఎంపీ కార్యాలయంలో, తర్వాత రామసముద్రం, నిమ్మనపల్లె మండలాల్లో సమావేశాలు జరిగాయి. సమావేశాలకు పార్టీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. దాంతో హాజరైన శ్రేణులతో సమావేశాలు ముగించారు. ఇందులో ఎంపీ కార్యాలయంలో ఎమ్మెల్యే షాజహాన్‌ బాషా, పరిశీలకులు వెంకటేష్‌ సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వార్డులో ఐదు మంది కార్యకర్తలకై నా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. న్యాయం చేయలేనప్పుడు ఈ సమావేశాలు ఎందుకని నిలదీశారు. పార్టీ..పార్టీ అంటే సరిపోదు కార్యకర్తలకు ఏం చేస్తున్నారు, వారిని పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. వీళ్లను కొట్టండి, వాళ్లతో కొట్టించుకోండి అని చెప్తారే మీరేం చేస్తున్నారని నిలదీశారు. ముందు కార్యకర్తలను కాపాడండి తర్వాత పార్టీని కాపాడుకుందాం, పది మంది కార్యకర్తలకు ఇది చేశామని చెప్పగలరా అని నిలదీశారు. కార్యకర్తలకు న్యాయం జరగనప్పుడు సమావేశం నిర్వహించి ఏం చెప్తారని ప్రశ్నించారు. కార్యకర్తల ప్రశ్నలకు అక్కడున్న నేతలు సమాధానాలు చెప్పకపోగా..ఇతర అంశాలపై ప్రసంగించి వెళ్లిపోయారు. కార్యకర్తలు ప్రశ్నిస్తున్నప్పుడు సమావేశానికి హాజరైన పలువురు కార్యకర్తలు ఇది నిజమే కదా అని చర్చించుకున్నారు. టీడీపీలో వర్గపోరు నెలకొంది. ఎమ్మెల్యే తమకు సహకరించడం లేదని, ఏ పనులు జరగడం లేదంటూ సీనియర్లు ఇప్పటికే పలుమార్లు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. పార్టీ సీనియర్లు, మంత్రుల సమక్షంలోనే తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ పట్టించుకునే దిక్కు లేకుండా పోయిందని సీనియర్లు గోడు వెల్లబోసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement