పుంగనూరు : పట్టణంలోని యూబి కాంపౌండులో నివాసం ఉంటున్న 29 ఏళ్ల వివాహిత కుటుంబ కలహాల కారణంగా బుధవారం శరీరంపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం అహ్మద్‌బాషాతో వివాహం జరిగింది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
వాహనం ఢీకొని
వృద్ధురాలికి గాయాలు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం ముది వేడు వద్ద బుధవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధురాలి పరిస్థితి విషమించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సుమారు 70 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వృద్ధ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గుర్తించామన్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలను ముదివేడు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.


