నా భర్తను అప్పగించండి | - | Sakshi
Sakshi News home page

నా భర్తను అప్పగించండి

Jun 11 2026 12:31 AM | Updated on Jun 11 2026 12:31 AM

మదనపల్లె టౌన్‌ : ‘నా ఐదోతనాన్ని కాపాడండి‘అంటూ బాధితురాలు రామిశెట్టి చంద్రకళ వేడుకుంది. బుధవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో మదనపల్లె పట్టణం, నీరుగట్టుపల్లికి చెందిన చంద్రకళ విలేకరులతో మాట్లాడుతూ.. 2004లో అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలోని బాలినాయునిపల్లికి చెందిన రామిశెట్టి (బీడ) శ్రీరాములు కుమారుడు దేవరాజ్‌ తో బెంగళూరు యలహంక గుడిలో తనకు వివాహ మైంది. పెళ్లయిన నాలుగు రోజులకే భర్త దేవరాజ్‌, అత్త రెడ్డెమ్మ, మామ బీడ శ్రీరాములు అదనపు కట్నం కోసం వేధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించింది. వేధింపులతో తాను రోగగ్రస్తురాలిగా మారి ఆసుపత్రి పాలయ్యానని, తన డబ్బు, బంగారం తీసుకుని విష ప్రయోగంతో చంపేయాలని చూశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త బతికే ఉన్నా చనిపోయాడని తప్పుడు డెత్‌ సర్టిఫికెట్‌ తెప్పించి, తాను 2006లో పెట్టిన వరకట్న వేధింపుల కేసును మదనపల్లె టూటౌన్‌ పోలీసులు మూసి వేశారని తెలిపింది. తనను మోసం చేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్త దేవరాజ్‌ కు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, పదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా పోలీసులు న్యాయం చేయలేదని కన్నీరు మున్నీరైంది. తన భర్త బతికే ఉన్నాడని, పోలీసులు తన ఐదోతనం తుడిచిపెట్టకుండా కాపాడాలని ప్రాధేయ పడింది.

బాధితురాలు చంద్రకళ వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement