పంటపొలాలపై ఏనుగుల దాడి | - | Sakshi
Sakshi News home page

పంటపొలాలపై ఏనుగుల దాడి

Jun 11 2026 12:25 AM | Updated on Jun 11 2026 12:25 AM

పులిచెర్ల(కల్లూరు): పులిచెర్ల మండలంలో పంట పొలాలపై ఏనుగుల దాడిచేశాయి. బుధవారం తెల్లవారు జామున మండలంలోని పాళెం పంచాయతీ జూపల్లెకు చెందిన రైతు మునస్వామి మామిడితోపులోకి రెండు ఏనుగులు ప్రవేశించి కోత కొచ్చిన మామిడి పంటను నాశనం చేశాయి. అదేభూమిలోని డ్రిప్‌ పైపులనుకూడా విరిచి వేశాయి.గతకొన్ని రోజులుగా చుట్టు పక్కల ఎక్కడా కనిపించని ఏనుగులు తిరిగి ప్రత్యక్షం కావడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందు తున్నారు.

పోలీసులపై డీఎస్పీకి ఫిర్యాదు

కురబలకోట: తన భూమిలో అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యంగా కబ్జాకు ప్రయత్నం చేస్తున్న వారికి స్థానిక పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండలంలోని అంగళ్లు గ్రామం తుంగావారిపల్లికి చెందిన పి.సోమశేఖర్‌ బుధవారం మదనపల్లె డీఎస్పీ పావనికి బుధవారం ఫిర్యాదు చేశారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమికి అన్ని రికార్డులు ఉన్నాయని, కొన్నేళ్లుగా తమ స్వాధీనంలో కూడా ఉందని తెలిపారు. ఇలాంటి భూమిలో పది కుంటల స్థలాన్ని ఆక్రమించే యత్నం చేస్తున్న వారికి పోలీసులు కూడా సహకరిస్తుండడంపై కూడా తగిన ఆధారాలతో డీఎస్పీకి వివరించినట్లు తెలిపారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.

బాధ్యతల స్వీకరణ

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా జే.భరత్‌ కు మార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా లో సర్వే, భూమి రికార్డుల నిర్వహణ, సేవల మెరుగుదల తదితర అంశాలపై చర్చించారు.

జిల్లా పరిషత్‌లోకారుణ్య నియామకాలు

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాల కింద 22 మందికి జూనియర్‌ అసిస్టెంట్లుగా, ముగ్గురికి టైపిస్టులుగా ఉద్యోగాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రామగోవిందరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.

దుప్పి మాంసాన్ని

పంచుకున్న ఇద్దరు అరెస్టు

మైదుకూరు : వనిపెంట అటవీ రేంజ్‌లోని గంగాయపల్లె బీట్‌లో చుక్కల దుప్పి మాంసాన్ని భాగాలు చేసి పంచుకున్న ఇద్దరిని బుధవారం అటవీ అధికారులు అరెస్టు చేశారు. మరో 8 మంది పరారయ్యారు. అటవీ రేంజ్‌ అధికారి చలపతి నాయుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గంగాయపల్లె బీట్‌లో బుధవారం ఉదయం ఓ చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేసి చంపాయి. మున్సిపాలిటీ పరిధిలోని చిన్నయ్యగారిపల్లెకు చెందిన పది మంది ఆ దుప్పిని కోసి భాగాలు వేస్తున్న విషయాన్ని వనిపెంట అటవీ అధికారులకు తెలిసింది. వారు దాడి చేయగా వెంకటసుబ్బయ్య, ప్రసాద్‌ దొరికారు. మిగిలిన 8 మంది పరారయ్యారు. దొరికిన వారి నుంచి ఆరు కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేశామని, పరారైన వారి కోసం గాలిస్తున్నామని ఎఫ్‌ఆర్‌ఓ చలపతి నాయుడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement