సాక్షి, మదనపల్లె: ఒకప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో పండే టమాట మదనపల్లె మార్కెట్ యార్డ్‌కు వచ్చేది. అక్కడి రైతులు ఇక్కడ విక్రయించుకునే వారు. కాలక్రమంలో కర్ణాటకలోనూ టమాట మార్కెట్లు ఏర్పాటు కావడంతో రైతులు అటువైపు మొగ్గు చూపడం మొదలైంది. దాంతో అక్కడి రైతులు కర్ణాటకకే పరిమితమయ్యారు. ఈ పరిస్థితుల్లో వారం రోజులుగా కథ మళ్లీ మొదటికొచ్చింది. కర్ణాటక రైతులు మదనపల్లె మార్కెట్ బాట పడుతున్నారు. తమ దిగుబడిని ఇక్కడికి తరలించి విక్రయించుకుంటున్నారు. ఈ పరిస్థితులు ఇంకా మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిహద్దులోని రాయల్పాడు, లక్ష్మీపురం, బద్దిపల్లి, అడ్డగల్, గౌనిపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు టమాట పంటను మదనపల్లెకు తెస్తున్నారు. ఇక్కడి మార్కెట్లో 15 కిలోల క్రేట్లను అమలు చేయడం, కమిషన్ లేకపోవడంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో 15 కిలోల క్రేట్ల ద్వారానే క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మదనపల్లె ఈ ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో రవాణా ఇబ్బందులు తగ్గుతాయని రైతులు ఇటువైపు వస్తున్నారు. కాగా మదనపల్లెకు వస్తున్న టమాటా దిగుబడి కూడా భారీగా పెరిగింది. బుధవారం 1,440 టన్నుల టమాట వచ్చింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా వచ్చిన అత్యధిక టమాట ఇదే. కర్ణాటక నుంచి వచ్చిన రైతుల దిగుబడి కూడా ఉంది. అయితే ధర మాత్రం తగ్గింది. కాగా గత నెల 27న 1,080 టన్నులు, 31న 1,156 టన్నులు, ఈనెల 8న 1,003 టన్నులు, 9న 1,260 టన్నుల టమాట విక్రయానికి వచ్చింది.


