ఒకరితో పనులు చేయించలేం..! | - | Sakshi
Sakshi News home page

ఒకరితో పనులు చేయించలేం..!

Jun 10 2026 1:49 AM | Updated on Jun 10 2026 1:49 AM

సాక్షి, మదనపల్లె: ఒక డీఈతో 42 కిలోమీటర్ల కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు కష్టమవుతుంది. నాణ్యత, పనుల వేగం అసాధ్యం అంటూ కదిరి డివిజన్‌–9 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజగోపాల్‌ మదనపల్లె సర్కిల్‌ ఎస్‌ఈ విఠల్‌ ప్రసాద్‌ కు రాసిన లేఖ మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఒకే ఒక్కడు.. పంచపాత్రాభినయం శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. హంద్రీనీవా ప్రాజెక్టు పరిధిలోని పుంగనూరు ఉప కాలువ (పీబీసీ)పనుల నుంచి ముగ్గురు డీఈఈ లను తొలగించి ఒకరికి పని అప్పగించడంపై ప్రత్యేక కథనాలతో సాక్షి వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాల కంటే ముందు గతనెల ఐదవ తేదీన ఈ వ్యవహారంపై రాజగోపాల్‌ స్పష్టమైన లేఖను రాసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అయినప్పటికీ ఉన్నతాధికారి నుంచి ఇప్పటివరకు స్పందన లేకపోవడం పరిశీలిస్తే..రాజకీయ, కాంట్రాక్టు సంబంధిత పెద్ద మతలబేదో ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈఈ రాజగోపాల్‌ రాసిన లేఖలు అంశాలు పరిశీలిస్తే ఉన్నతాధికారులు తీసుకున్న చర్య తప్పిదం అన్న విషయంతో పాటు, కావాలనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం స్పష్టంగా వ్యక్తమవుతోంది. ఆ లేఖలో ఈఈ పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.

● గతంలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ డివిజన్‌–12 (కుప్పం) కింద ఉన్న సబ్‌ డివిజన్‌–1, 2, 4 కు చెందిన డీఈఈలు, ఏఈఈలను పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ కిలో మీటర్‌ 165.000 నుండి కిలో మీటర్‌ 207.800 వరకు పనుల కోసం నియమించారు. తర్వాత వారిని ఉపసంహరించారు.

● ఇప్పుడు మిగిలిన కాంక్రీట్‌ లైనింగ్‌, ఎస్‌ఎఫ్‌ఆర్సీ, సీఎం అండ్‌ సీడీ పనులు 42 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. వీటికి ఎక్కువ మంది డీఈఈలు, ఏఈఈల అవసరం ఉంది.

● ఈ మొత్తం 42 కి.మీ పనిని డీఈఈ వై.కృష్ణకిశోర్‌ (సబ్‌ డివిజన్‌ నం.1, కదిరి) ఒకరికే అప్పగించారు. ఆయనకు ఇప్పటికే కిలో మీటర్‌ 110.000 నుండి కిలోమీటర్‌ 150.000 వరకు పనులు ఉన్నాయి. అదనంగా కిలోమీటర్‌ 165.000 నుండి కిలోమీటర్‌ 207.800 వరకు కూడా అప్పగించారు.

● ఇదే డివిజన్‌లో వై.కృష్ణకిశోర్‌తో పాటు ఉన్న ఏఈఈ వి.వంశీకృష్ణ రెడ్డి దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దాంతో ఈ సబ్‌ డివిజన్‌న్‌లో ఇప్పుడు ఏఈఈలు ఎవరూ లేరు.

● 42 కి.మీ పనులను ఒకే డీఈఈతో నాణ్యంగా, సకాలంలో పూర్తి చేయడం కష్టం.

కాబట్టి గతంలో ఈ పనులు చేసిన అనుభవజ్ఞులైన డీఈఈలు, ఏఈఈలను తిరిగి నియమించాలి. వారిని నియమించిన పక్షంలో వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అని రాజగోపాల్‌ ఎస్‌ఈకి రాసిన లేఖలో స్పష్టంగా కోరారు.

అధికార వర్గాల్లో అలజడి..

హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ మదనపల్లె సర్కిల్‌–3లో నెలకొంటున్న విషయాలు, కాంక్రీట్‌ లైనింగ్‌ పనులతీరు, పీబీసీ, కేబీసీల్లో కాంక్రీట్‌ లైనింగ్‌ పనుల అప్పగింత వ్యవహరం, కుప్పం డివిజన్‌–12 మదనపల్లెలోనే ఇంకా కొనసాగుతుండటం, దాన్ని కుప్పానికి తరలించకుండా ఇక్కడి నుంచే విధులు నిర్వహించడం, డీఈఈలకు పనుల బాధ్యతల తొలగింపు, నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగింత..ఇలాంటి ఎన్నో విషయాలపై సాక్షిలో వస్తున్న వరుస కథనాలతో ప్రాజెక్టు అధికారుల్లో అలజడి నెలకొంది. రహస్యంగా సాగిపోతున్న చర్యలు వెలుగులోకి వస్తున్నాయని, దీనికి తాము బాధ్యులం కావాల్సి వస్తున్న ఆందోళన కొందరిలో వ్యక్తం అవుతోంది. ఇష్టారాజ్యంగా సాగిపోతున్న పనులు బహిర్గతం అవుతుండటంతో వాటిని ఉన్నతాధికారులు సమర్ధించుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి.

నాణ్యత, పనుల్లో వేగం కష్టం

ఆ ముగ్గురు డీఈఈలను

తిరిగి ఇవ్వండి

గతనెల ఐదునే ఎస్‌ఈకి

లేఖ రాసిన ఈఈ

సాక్షి కథనాలు అక్షర సత్యాలు

ప్రాజెక్టు అధికార వర్గాల్లో అలజడి

స్పందించి వివరాలు కోరిన కలెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement