సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పై ఉన్న గవర్నర్ అతిథిగృహ దుస్థితిపై గత నెల 6న సాక్షిలో గవర్నర్ ఘోస్ట్ హౌస్ శీర్షిక ప్రచురితమైన కథనంపై పర్యాటకశాఖ స్పందించింది. అతిథిగృహ ఆధునీకరణకు, ఇతర పనులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని పర్యటశాఖ ప్రాజెక్టుల విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేషగిరిరావు ఆదేశించారని ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం డీఈఈ శ్రీనివాస్ సాక్షికి తెలిపారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తామని, గవర్నర్ బంగ్లాను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
హార్సిలీహిల్స్
కాంట్రాక్టు రద్దు
సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పై ఉన్న టూరిజం యూనిట్ అభివృద్ధికి గత ప్రభుత్వం రూ.9.13 కోట్లు మంజూరు చేసింది. ఇందులో కాంట్రాక్టర్ రూ.కోటి విలువైన పనులు మాత్రమే చేసి మిగతా పనులు వదిలేశారు. దీనిపై సోమవారం సాక్షిలో హార్సిలీ హిల్స్ అభివృద్ధికి చంద్రగ్రహణం అన్న శీర్షిక ప్రచురితమైన కథనంపై ఇంజనీరింగ్ విభాగం డీఈఈ శ్రీనివాస్ స్పందించారు. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సంస్థను తొలగించేందుకు పర్యాటకశాఖ నిర్ణయించిందని తెలిపారు. నిధులను సద్వినియోగం చేసుకునేందుకు మరో కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించే విధంగా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు.
ప్రకృతి వ్యవసాయ ప్రచార కరదీపికలు ఆవిష్కరణ
మదనపల్లె సిటీ: ఎల్‌నిలో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ 2026–27 ప్రచార కరదీపికలను మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆవిష్కరించారు. రైతులకు వాతావరణ మార్పులు, పంటల నిర్వహణ, జీవ ఉత్ప్రేరకాల వినియోగం వంటి అంశాలపై సమయానుకూలంగా అవగాహన కల్పించడం అవసరమన్నారు. జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాలు, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టుల ద్వారా కరదీపికలను రైతులకు అందించి విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. డిజిటల్ వేదికలు, మొబైల్‌యాప్‌లు, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వ్యవసాయ సలహాలు రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయం, తేమ సంరక్షణ, నీటి నిర్వహణ, దేశవాళీ విత్తనాల వినియోగం, మిశ్రమ పంటల సాగు ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ, సమాచార శాఖ ఏడీ పురుషోత్తం, వ్యవసాయశాఖ ఏఓ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు
తగ్గించాలని రాస్తారోకో
మదనపల్లె టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మదనపల్లె పట్టణంలోని అనిబిసెంట్ కూడలి వద్ద సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వామపక్షాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.కృష్ణప్ప, సీపీఎం శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ సామాన్య ప్రజలపై భారాలు మోపుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
సీపీఐ వినూత్న ప్రదర్శన
పుంగనూరు: డీజల్, పెట్రోల్ ధరలను పెంచడంపై సీపీఐ వినూత్న ప్రదర్శన చేపట్టింది. మంగళవారం సీపీఐ కార్యదర్శి వెంకట్రమణారెడ్డి, రామమూర్తి, కార్యకర్తలు కలసి ఆటోలకు తాడుకట్టి లాగుతూ ప్రదర్శన చేశారు.


