మదనపల్లె సిటీ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) కలవరపెడుతోంది. నిర్ణీత సమయంలోగా ఉత్తీర్ణత సాధించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాక ముందు ఉపాధ్యాయులుగా నియమితులై అయిదేళ్లుకుపైగా సర్వీసు ఉన్న వారు రెండేళ్లలోపు టెట్ తప్పనిసరిగా అర్హత సాధించాలని ఆదేశించింది. 2011 ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారంతా 2028 ఆగస్టు 31 లోపు టెట్ ఉత్తీర్ణత కావాలి.
స్కూల్ అసిస్టెంట్‌లకు ఇబ్బందే:
2010కి ముందు డీఎస్సీల ద్వారా ఎంపికై న ఉపాధ్యాయులంతా టెట్ రాయాల్సి ఉంది. ఎస్జీటీలతో పోలిస్తే స్కూల్ అసిస్టెంట్లు పరీక్షను ఎదుర్కొనటం కొంచెం ఇబ్బందే. ఎందుకంటే వీరిలో ఎక్కువ మంది ఏదొక సబ్జెక్టునే 6–10 తరగతులకు బోధిస్తుంటారు. టెట్‌కు మాత్రం అన్ని సబ్జెక్టులు చదవకతప్పదు. ఉదాహరణకు జీవశాస్త్రం ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టు నుంచి 20 మార్కులే ప్రశ్నలు వస్తాయి. మిగతా 130 మార్కుల కోసం పిల్లల అభివృద్ధి పెడగాజీ, మాతృభాష, ఆంగ్లభాష, గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలను చదవాల్సి ఉంటుంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 6 వేల మందికిపైగానే..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 6 వేలకుపైగానే 2010 డీఎస్సీకి ముందు ఎంపికై నవారు. వీరంతా ఇప్పుడు టెట్ రాయాల్సి ఉంది.
ఉపాధ్యాయులు నిరసన
ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం అమెండ్‌మెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో జిల్లా కేంద్రమైన మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో మంగళవారం ఉపాధ్యాయులు నిరసన తెలియజేశారు. జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ హేమలత మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ డీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష రాసి మెరుగైన ర్యాంకులు సాధించిన తర్వాతే పోస్టులు పొందడం జరిగిందన్నారు. ఇప్పుడు విద్యార్థులకు బోధిస్తున్న సమయంలో ఈ నిబంధన తీసుకురావడంవల్ల ఉపాధ్యాయులు అభద్రతకు గురవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్, రవిప్రకాష్, పురం వెంకటరమణ, ఆదినారాయణ, విజయ్‌కుమార్, నరసింహులు, మురళి, రమాదేవి, కుసుమ, సంగీత, నాగమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


