● సూపర్ సిక్స్ పేరుతో మోసం
● ఈ నెల 12న శాంతియుత ర్యాలీ
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్‌రెడ్డి
రాయచోటి అర్బన్ : రెండేళ్ల కూటిమి పాలన అన్ని రంగాల్లో విఫలం అయ్యిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సాలు పూర్తవుతోందని, దాదాపుగా 50 శాతం పాలన అయిపోయిందన్నారు. ఇప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజల సహకారంతో రాయచోటి పట్టణంలో శాంతియుత ర్యాలీ చేయబోతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రూ.3.50 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మండిపడ్డారు. చేసిన అప్పును సంక్షేమ పథకాలకు కూడా వినియోగించడం లేదని పేర్కొన్నారు. వందలాది హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేశాం, పండుగ చేసుకోండని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలలో 50 ఏళ్లకు పిఛన్, మహిళలకు నెలకు రూ.1500లు, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా అందరినీ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో డ్వాక్రా మహిళా సంఘాలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీ వచ్చేటువంటి పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సున్నా వడ్డీ మాటే లేదన్నారు. మరో వైపు రైతులను నిర్ధాక్షిణ్యంగా మోసం చేస్తున్నారని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని పేర్కొన్నారు. ఇంత వరకు ఒకసారి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీకి రూ.5 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆసుపత్రులలో వైద్యం అందడం లేదన్నారు.
భ్రష్టు పట్టిన లా అండ్ ఆర్డర్
లా అండ్ ఆర్డర్‌ను భ్రష్టు పట్టించారని పేర్కొన్నారు. గండికోటలో ఒక మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం, పుంగనూరు, మదనపల్లి, కడప, బద్వేల్, నందికొట్కూరులలో సంఘటనలలో బాధితులకు న్యాయం చేయడం లేదన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు నిత్యావసర సరుకుల ధరలను కూడా నియంత్రణలోకి తీసుకురాలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. మరోవైపు రాయచోటి చుట్టూ ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిలో హెచ్చరిక బోర్డులు జగన్ హయాంలో ఏర్పాటు చేయిస్తే, ఇప్పుడు కూటమి పాలకుల అండతో యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారని తెలిపారు.
రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలి
2022లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 26 జిల్లాలు ఏర్పాటు చేసిందని, అందులో భాగంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ గెజిట్ ప్రకారం 26 జిల్లాలే కొనసాగుతున్నాయని, ఈ ప్రభుత్వం చేసిన 28 జిల్లాల ప్రతిపాదనకు కేంద్ర గెజిట్ లేదన్నారు. అందుకే అన్నమయ్య జిల్లాకు రాయచోటిని యథాతథంగా జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలను తిరిగి ఇక్కడనే పెట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తప్పిదం చేసిందని, ఇప్పటికై నా సరైన విధానంలోకి రావాలని హితవు పలికారు.
అదనపు బస్టాండ్ డీపీఆర్‌కే రెండేళ్లు
రవాణా శాఖ మంత్రి రాయచోటికి బస్టాండ్ వచ్చింది, వచ్చింది అని రెండేళ్ల నుంచి చెబుతున్నాడని, స్వయంగా ఆ శాఖ మంత్రి అయి ఉండి బస్టాండ్ ఏర్పాటు డీపీఆర్‌కు రెండేళ్లు సమయం పట్టిందంటే, అభివృద్ధి ఎప్పుడు చేస్తారో అని పేర్కొన్నారు. తనకు మంత్రి పదవీ లేకపోయినా అప్పటి సీఎం జగన్ ద్వారా జిల్లా కేంద్రం ఏర్పాటుతోపాటు అనేక కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. తాగునీటి పైపులు వేస్తున్నామని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారే... బస్టాండ్ డీపీఆర్‌ల కోసం రెండేళ్లు పట్టిందే, ఆ నీటి స్కీం మీరు చేయగలుగుతారా అని ప్రశ్నించారు. తాము మూడు సంవత్సరాల పాటు ఆర్‌డబ్లూఎస్ అధికారులతో నిరంతరం కష్టపడి ఎక్కడ పైప్‌లైన్ ఉండాలి, ఎక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండాలి, ఏ ప్రాంతం నుంచి గ్రావిటీ ఎక్కడ వస్తుందన్న విషయాలపై డ్రాయింగ్ తీసుకుని కష్టపడి పని చేసిన విషయాలను ఆయన గుర్తు చేశారు. హంద్రీ నీవా, గాలేరు నగరి లింక్ చేయలా, గాలేరు నుంచి గ్రావిటీని హంద్రీ నీవాలోకి రాయచోటికి వెలిగల్లు ద్వారా కలిపే పనులను డీపీఆర్‌లు తయారు చేయించి, టెండర్లు కూడా పిలిపించి, పనులను కూడా ప్రారంభించామన్నారు.
ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలి
వైఎస్సార్‌సీపీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీన రాయచోటిలో శాంతియుత నిరసన ర్యాలీని చేపడుతన్నామని తెలిపారు. యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాషా, వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ నవాజ్ తదితరులు పాల్గొన్నారు.


