టెండర్‌ లెస్సు.. పారిశుద్ధ్యం తుస్సు | - | Sakshi
Sakshi News home page

టెండర్‌ లెస్సు.. పారిశుద్ధ్యం తుస్సు

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

మదనపల్లె మార్కెట్‌లో నెలకు రూ.26,600 టెండర్‌

పనులు వదిలేసిన కాంట్రాక్టర్‌

కుప్పలుగా పేరుకుపోయిన టమాట వ్యర్థాలు

సాక్షి, మదనపల్లె : మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌ దేశంలోనే అతిపెద్దది. టమాట క్రయ విక్రయాల్లో ఆసియాలోనే పెద్దది. అలాంటి మార్కెట్లో పారిశుద్ధ్య చర్యలు ఏ స్థాయిలో చేపట్టాల్సి ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే పోటీపడి పారిశుద్ధ్య పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇప్పుడు చేతులెత్తేశాడు. టమాట వ్యర్థాలను తొలగించకపోవడంతో కుప్పలుగా పేరుకుపోయాయి. వాటి దుర్వాసన భరించలేకపోతున్నారు. పరిస్థితులు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది ఎదురుచూడాల్సి వస్తోంది.

టెండర్‌కు పోటాపోటీ

మదనపల్లె మార్కెట్లో రోజూ వందల టన్నుల్లో టమాట వస్తుంది. వాటి గ్రేడింగ్‌, నాసిరకం టమాటలను మార్కెట్లోనే వదిలేస్తారు. వీటిని ఏరోజుకారోజు తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనుల అప్పగింత కోసం గత నెలలో టెండర్లను నిర్వహించారు. ఇందులో ఎనిమిది మంది వ్యక్తులు పాల్గొన్నారు. వారిలో మనోహర్‌ అనే వ్యక్తి నెలకు రూ.26,600తో పనులు చేపట్టేందుకు టెండర్‌ దాఖలు చేశారు. అధికారులు దీన్నే ఖరారు చేశారు. వాస్తవంగా గతంలో నెలకు రూ.72 వేలు చెల్లించేవారు. ఇప్పుడు ఈ కాంట్రాక్టు పని దక్కించుకోవాలన్న లక్ష్యంతో పోటాపోటీగా పాల్గొన్నారు. పాల్గొన్న వారు రూ.75 వేల నుంచి రూ.26,600 వరకు టెండర్లు దాఖలు చేశారు. మనోహర్‌ దాఖలు చేసిన టెండర్‌ని ఖరారు చేశారు.

టెండర్‌ ఖరారు చేస్తే..

నెలకు రూ.26,600తో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌ పనులు చేపట్టాలి. దీనికోసం గత నెల 13న ఏడాది పాటు ఒప్పందం జరిగింది. ప్రతిరోజు 10 నుంచి 15 ట్రాక్టర్ల వ్యర్థాలను ఇక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. అయితే కొత్త కాంటాక్ట్‌ ఇంత వరకు ఒక్క రోజు కూడా పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించలేదు. మొక్కుబడిగా రెండు–మూడు ట్రాక్టర్ల వ్యర్థాలను తొలగించి మిగిలినవి వదిలేస్తున్నారు. దాంతో మార్కెట్లో కంపు కొడుతోంది. రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎలా ఖరారు చేశారు

పోటాపోటీగా సాగిన టెండర్లలో రూ.26,600 అధికారులు ఎలా ఖరారు చేశారు అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. గతంలో నెలకు రూ.72 వేలు ఉన్న ఈ టెండర్‌.. ఇప్పుడు అందులో రూ.45,400 తగ్గించి టెండర్‌ దాఖలు చేస్తే, కాంట్రాక్టర్‌ పనులు నిర్వహిస్తారని ఎలా ఆశించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై మార్కెటింగ్‌ శాఖ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement