వాల్మీకిపురం : పట్టణంలోని తరిగొండ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి వైన్‌షాప్‌లో చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. గుర్తు తెలియని దుండగులు స్థానిక తరిగొండ రోడ్డులో వైన్‌షాప్‌లోకి చొరబడ్డారు. దుకాణం పైకప్పు రేకులు తొలగించి, లోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్‌లోని రూ.76 వేల నగదు, మద్యం బాటిళ్లు చోరీ చేశారని క్యాషియర్ యుగంధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం షాప్ తెరిచేందుకు వెళ్లిన క్యాషియర్ యథావిధిగా షెట్టర్ తీసి లోనికి వెళ్లారు. అక్కడ క్యాష్ కౌంటర్ పెట్టెను పగలగొట్టడం గమనించి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రాఘవరెడ్డి, ఎస్‌ఐ తిప్పేస్వామి ఆధ్వర్యంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల వేలిముద్రలను సేకరించారు.
చెరువులో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం
పుంగనూరు : మండలంలోని కొండసముద్రం గ్రామ చెరువులో సుమారు 70 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని మంగళవారం గ్రామస్తులు గుర్తించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని, శవాన్ని నీటిలో నుంచి వెలికితీశారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరే ఇతర కారణాలతో అయినా మృతి చెందాడా? అనే విషయాలు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నగదు స్వాహాపై ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : ఖాతాలో ఉన్న రూ.1.86 లక్షల స్వాహాపై ఓ బాధితుడు మంగళవారం మదనపల్లె ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై వివరాలు.. పట్టణంలోని త్యాగరాజవీధికి చెందిన గౌస్‌అహ్మద్, అతని తల్లి సిరాజున్నీసాల ఖాతాల్లో ఉన్న రూ.1.86 లక్షల నగదు నాలుగు రోజుల కిందట మాయమైంది. ఏటీఎం కార్డు జేబులో ఉండగానే, బ్యాంక్‌కు వెళ్లి నగదు డ్రా చేయకుండానే.. ఖాతాల్లో ఉన్న నగదు మాయంపై బాధితులు ఆందోళనకు గురై వెంటనే బ్యాంకుకెళ్లి అధికారులను సంప్రదించారు. సైబర్ నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేసినట్లు వారు చెప్పడంతో వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. గౌస్‌ఆహ్మద్ మంగళవారం ఎస్సీ ధీరజ్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశాడు.
బంగారు హారం అపహరణ
ముద్దనూరు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ మెడలో ధరించిన బంగారు హారం మంగళవారం చోరీకి గురైంది. ముద్దనూరుకు చెందిన ప్రమీళ అనే మహిళ కడపలో ముద్దనూరుకు చెందిన వారి వివాహానికి హాజరై తిరిగి మధ్యాహ్నం కడపలో బైపాస్ రైడస్ బస్సులో ఎక్కింది. ముద్దనూరులోని 4 రోడ్ల కూడలిలో బస్సు దిగి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి గమనించగా తన మెడలో ధరించిన సుమారు 3 తులాల బంగారు హారం చోరీకి గురైనట్లు గుర్తించింది.
ఎస్పీ కార్యాలయం వద్ద గౌస్‌అహ్మద్


