పీలేరు రూరల్ : జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. పీలేరు టౌన్‌లో కారు, బైక్ ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర రక్త గాయాలు అయిన సంఘటన మంగళవారం జరిగింది. సీఐ యుగంధర్ కథనం మేరకు వివరాలి ఉన్నాయి. పీలేరు పట్టణం ఆర్టీసీ నల్లగుట్టకు చెందిన షేక్ షామీర్ స్థానిక సాయిబాబాగుడి వీధికి చెందిన అఖిల్ అను ఇరువురు మంగళవారం సాయంత్రం క్రికెట్ ఆడి బైక్‌పై వెళ్తూ పీలేరు నుంచి తిరుపతికి వెళ్తున్న కారును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో షమీర్, అఖిల్ లకు తీవ్ర రక్త గాయాలు కావడంతో 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ప్రమాదంపై పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బైక్‌ను ఆటో ఢీకొని మంటలు
మదనపల్లె టౌన్ : ఆటో ఢీకొని బైక్‌లో మంటలు చెలరేగడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణంలోని ఎస్టేట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఖాదర్‌వల్లి కుమారుడు మహమ్మద్ ఆరిఫ్ (20) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ప్రయాణికులను తీసుకెళ్తున్న తన ఆటోకు పెట్రోల్ లేకపోవడంతో ఆటో ఆగి పోయింది. స్థానికుల సాయంతో వెంటనే స్థానిక పెట్రోల్ బంకు వద్దకు వచ్చి క్యానులో పెట్రోల్ నింపుకొని స్నేహితుని బైక్‌లో బైపాస్ రోడ్డు వద్దకు వెళుతుండగా మార్గంమధ్యలోని వెన్నెల రెస్టారెంట్ వద్ద బైక్‌ను ఆటో వచ్చి ఢీకొంది. దీంతో బైక్‌లో మంటలు చెలరేగి ఆరిఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మిద్దైపె నుంచి పడి..
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : నిద్రించేందుకు మిద్దైపెకి వెళ్లిన ఓ టైలర్ ప్రమాదవశాత్తు కిందపడి కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఉదయం నిమ్మనపల్లె మండలంలో ఈ ఘటన వెలుగు చూసింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవలంకురప్పల్లికి చెందిన టైలర్ చంద్రమోహన్(35) సోమవారం రాత్రి మిద్దైపె పడుకోవడానికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ నిద్రలో ఉండగా, ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి కిందకు పడిపోయాడు. ఈ ఘటనలో కాళ్లు, చేతులు, నడుము విరిగి నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నిమ్మనపల్లె పోలీసులు తెలిపారు.


