● ప్రాణాపాయ స్థితిలో కవల పిల్లలు
● తల్లిదండ్రులు నిరుపేదలు
● ఆపన్నహస్తం అందించి
ఆదుకోవాలని వేడుకోలు
పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రంలోని మసీదు వీధిలో సాయివర్దన్, శిరీష దంపతులు నివసిస్తున్నారు. దినసరి వ్యవసాయ పనులే వీరి జీవనాధారం. ఈ క్రమంలో గత నెల 31న శిరీష మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆ దంపతుల ఆనందం గంటల వ్యవధిలోనే ఆవిరైపోయింది. శిరీషకు నెలలు నిండకనే జన్మించిన ఇద్దరు పిల్లల బరువు 700 నుంచి 800 గ్రాములు మాత్రమే ఉండటంతో.. తక్షణం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో దిక్కుతోచని వారు హుటాహుటిన ప్రాణాపాయ స్థితిలో ఉన్న కవల పిల్లలను కాపాడుకునేందుకు వెంటిలేటర్ సాయంతో బెంగళూరుకు వెళ్లారు. అక్కడ ఆసుపత్రిలో రోజుకు రూ.లక్షకు పైగా ఖర్చు వస్తోందని, ఇప్పటి వరకు రూ.10 లక్షలకు పైగా ఖర్చు వచ్చిందని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శిరీష పేరు రేషన్ కార్డులో కూడా ఇంకా నమోదు కాకపోవడం, ఎన్‌టీఆర్ వైద్య సేవ కార్డు కూడా లేనందున దంపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, భారీ మొత్తంలో ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భరించే స్తోమత లేదని వారు వాపోయారు. మానవతావాదులు, దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు స్పందించి ఫోన్ పే శిరీష 8179066898, సాయివర్దన్ 9110539333ల పేరిట పిల్లల వైద్య ఖర్చులకు సాయం అందించి ఆసుపత్రి అత్యవసర వైద్య విభాగంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ పిల్లలకు పునర్జన్మ ఇచ్చి ఆదుకోవాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు.


