ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని పలు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ సామగ్రిని అపహరించిన నలుగురిని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను మంగళవారం సాయంత్రం వన్‌టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. పట్టణంలోని మట్టిమసీదు వీధికి చెందిన షేక్ అబ్దుల్ సుభహాన్ కార్పెంటర్ పని చేసేవాడు. ఇతను ముగ్గురు మైనర్ బాలురులతో కలసి యర్రగుంట్ల, జమ్మమడుగు బైపాస్ రోడ్డులో గత నెల 17న రాత్రి సమయంలో కడ్డీలు కటింగ్ చేసే మిషన్‌ను దొంగలించాడు. అదే రోజు రాత్రి మరో రెండు ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ పని ముట్లను చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితుడు షేక్ సాధక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేసి చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. ఈ క్రమంలో నలుగురు నిందితులు ఎర్రగుంట్ల రోడ్డులోని వాసవి సర్కిల్ సమీపంలో ఉండగా ఎస్ఐ సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు సీఐ తెలిపారు.


