మదనపల్లె టౌన్ : డ్రైవరన్నా మేలుకో.. నిద్రమత్తు వీడి క్షేమంగా గమ్యం చేరుకో... అంటూ జిల్లా పోలీసులు వినూత్న ప్రచారానికి తెరలేపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై పోలీసులు వాహన డ్రైవర్లను నిలిపి వారి చేత ముఖాలు కడిగించి.. నిద్రమత్తు వదిలించే కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కడప– చైన్నె జాతీయ రహదారి, సంబేపల్లి, రాయచోటి, గుర్రంకొండ, అలాగే ముంబై టు చైన్నె జాతీయ రహదారి మదనపల్లె, పుంగనూరు రోడ్లపై పోలీసులు వాహనాలను నిలిపి తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా లేదా నిద్రమత్తులో ఉన్నారా అన్న విషయాన్ని పరిశీలించి వారికి సూచనలు, సలహాలు ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో..’ సత్ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా, ఒక బాధ్యతాయుతమైన మిత్రుడిలా జిల్లా పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం వాహనదారుల్లో చైతన్యం నింపుతోంది.


