● ఇంటర్‌లో అప్రమత్తత అవసరం
● గాడి తప్పితే జీవితమే గందరగోళం
● క్రమశిక్షణ అలవరుచుకుంటే
ఉజ్వల భవిష్యత్తు
మదనపల్లె సిటీ : పదో తరగతి వరకు ఓ లెక్క. ఆ తరువాత మరో లెక్క. బాల్య దశకు క్రమంగా వీడ్కోలు పలుకుతూ ఇంకోమెట్టు ఎక్కే దశనే ఇంటర్. ఇక్కడ వేసే ప్రతి అడుగు.. తీసుకునే నిర్ణయం భవితవ్యాన్ని సూచిస్తుంది. జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు మొదలవగా.. మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కొంగొత్త ఆశలతో ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు జాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
దిశానిర్దేశం అవసరం
విద్యార్థి జీవితంలో ఇంటర్ కీలక మలుపు. ‘పది’ పూర్తయ్యే వరకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పరిశీలన ఉంటుంది. ఇంటర్ విషయానికొస్తే.. అప్పటి వరకు ఉన్న ఉపాధ్యాయులు కనిపించరు పర్యవేక్షణ స్థాయి తగ్గుతుంది. ఈ తరుణంలో గాడితప్పే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూరిత వాతావరణంలో మెలుగుతూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలి.
భావోద్వేగాల నియంత్రణ
అప్పటి వరకు ఉన్న వాతావరణం, వ్యక్తులు కనిపించకపోవడం, సహచర విద్యార్థులలో త్వరగా కలిసిపోని పరిస్థితుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిిస్థితుల్లో లక్ష్యాలు పక్కదారి పట్టే అవకాశాలు లేకపోలేదు. టీనేజీ వయసులో భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. తాత్కాలిక ఆకర్షణ జోలికి వెళితే ఇబ్బందులు తప్పవు. చెడు వ్యసనాల జోలికి వెళ్లద్దు.
ఉత్తమ స్నేహం మేలు
స్నేహితుల ఎంపిక తీరు భవిష్యత్తు ఫలితాలపై ప్రభావం చూపుతుంది. స్నేహితున్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చుని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంటర్‌లో దాదాపుగా కొత్తవారే తరగతి గదుల్లో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో స్నేహితులను ఎంచుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. చెడుకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో మెలిగే స్నేహాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
సెల్‌ఫోన్‌తో జాగ్రత్త
పదో తరగతి తరువాత పలువురు గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు చదువు నిమిత్తం వెళ్తుంటారు. ఈ క్రమంలో తమ పిల్లలకు సెల్‌ఫోన్ కొనిచ్చే ముందు జాగ్రత్తలు వివరించాలి. నిర్లక్ష్యం వహిస్తే కలిగే నష్టాలను తల్లిదండ్రులు స్పష్టం చెప్పాలి. ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్, సైబర్ మోసాలపై అప్రమత్తం చేయాలి.
సున్నితంగా మార్పు తేవొచ్చు
ఇంటర్ చదివే విద్యార్థుల్లో మార్పు కనిపిస్తే తల్లిదండ్రులు స్నేహపూరిత వాతావరణంలో సున్నితంగా మార్పు తేవాలి. కళాశాల వద్ద ఏది జరిగినా చెప్పే వాతావరణం ఇంట్లో కల్పించాలి. పిల్లల్లో అసాధారణ మార్పు వస్తే గమనించి ఆరా తీయాలి. ఆత్మస్థైర్యం పెంపొందించాలి. కొందరు సర్దుకోలేక ఇంటిపై బెంగతో ఇబ్బంది పడుతుంటారు. మానసిక సమస్యలు మొదలువుతాయి. కౌన్సెలింగ్ ద్వారా మార్పు తేవొచ్చు.
–చాముండేశ్వరి, సైకాలజిస్టు, మదనపల్లె


