మదనపల్లె టౌన్ : గాజు ముక్కలు మింగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన సోమవారం గుర్రంకొండలో చోటు చేసుకుంది. ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండకు చెందిన మహమ్మద్ అలీ(35) కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపం చెందాడు. మద్యం మత్తులో గాజు ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించడంతో వారు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గుర్రంకొండ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
భార్యపై కోపంతో..
మదనపల్లె టౌన్ : వృద్ధాప్యంలో తనకు అండగా ఉండాల్సిన భార్య ఎడబాటుగా ఉండటమే కాకుండా తన బాగోగులు పట్టించుకోవడం లేదని, మనస్తాపం చెంది ఓ వృద్ధుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం పెద్దమండెం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు, జిల్లా ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కలిపేర్ల గ్రామం నత్తి ఓబన్నగారిపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి(65) భార్య గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో తనకు అన్నం వడ్డించేవారు, సపర్యలు చేసేవారు లేరని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దానికి తోడు భార్య ఎడబాటుగా ఉండడాన్ని జీర్ణించుకోలేక జీవితంపై విరక్తితో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు బాధితుడిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స అందించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఘటనపై పెద్దమండ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిపై తేనెటీగల దాడి
మదనపల్లె టౌన్ : తన వ్యవసాయ బావి దగ్గర పొలం పనులు చేస్తున్న యువకుడిపై తేనెటీగలు దాడి చేసి గాయపరిచిన సంఘటన సోమవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన మధుకర్‌రెడ్డి(23) ఊరికి సమీపంలోని తన వ్యవసాయ బావి దగ్గర పొలం పనులు చేస్తుండగా, ఒక్కసారిగా పెద్ద తేనెటీగలు గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడు.


