కోఆర్డినేటర్‌ శ్రీనివాసరాజును విధుల్లో నుంచి తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

కోఆర్డినేటర్‌ శ్రీనివాసరాజును విధుల్లో నుంచి తొలగించాలి

Jun 9 2026 4:54 AM | Updated on Jun 9 2026 4:54 AM

మదనపల్లె సిటీ : జిల్లా ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ శ్రీనివాసరాజు సుదీర్ఘ అక్రమ డిప్యూటేషన్‌, నిధుల దుర్వినియోగం, విద్యా అక్రమాలు, ప్రభుత్వ సర్వీసు నిబంధనల ఉల్లంఘనలపై విచారణ చేసి, అతన్ని విధుల్లో నుంచి తొలగించాలని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీనివాసరాజు అక్రమాల గురించి వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నరేష్‌, జిల్లా ఉపాధ్యక్షులు పవన్‌లు స్థానిక విలేకర్లకు వివరించారు. నిబంధల ప్రకారం ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌గా డిప్యూటేషన్‌ కాలపరిమితి మూడు సంవత్సరాలు, అయితే నింబధనలు తుంగలో తొక్కి డిప్యూటేషన్‌ పేరుతో అక్రమంగా ఆ పదవిలో కొనసాగుతున్నారన్నారు. ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ కేంద్రాల కేటాయింపులు, విద్యార్థుల నుంచి అక్రమంగా రూ.3 వేలు నుంచి రూ.5 వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. క్లాసులకు హాజరు కాని వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. ఒక బాధ్యతాయుత అధికారిగా ఉంటూ ఇటీవల కడపలోని హరిత హోటల్‌లో జరిగిన రాజకీయ సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా ఉల్లంఘించినట్లు తెలిపారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారన్నారని ఆరోపించారు. శ్రీనివాసరాజు అక్రమాలపై ప్రత్యేక విచారణ అధికారిని నియమించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్‌్‌ చేశారు. అవినీతికి కేరాఫ్‌గా మారిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్‌ విచారణ చేయించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సాఆర్‌ విద్యార్థి విభాగం నాయకులు విశ్వా, తేజ, ఉదయ్‌, మహేష్‌, అజాద్‌, ఖాన్‌, లోకి, చెన్న తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌కు వైఎస్సార్‌ఎస్‌యూ వినతి

Advertisement
 
Advertisement
Advertisement