బాధితులకు త్వరితగతిన న్యాయం | - | Sakshi
Sakshi News home page

బాధితులకు త్వరితగతిన న్యాయం

Jun 9 2026 4:48 AM | Updated on Jun 9 2026 4:48 AM

మదనపల్లె టౌన్‌ : ఫిర్యాది రాక వెనుక బాధ ఉంటుందని, ఆ సమస్యను గుర్తించి పరిష్కరించడమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే ఉద్దేశంతో సోమవారం మదనపల్లె పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన నేరుగా పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను స్వయంగా స్వీకరించి, వారి సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత అంశాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా కుటుంబ వివాదాలు, సైబర్‌ మోసాలు, భూ, ఆస్తి తగాదాలు, నకిలీ పత్రాల వ్యవహారాలు, అధిక వడ్డీ వేధింపులు, ఆన్‌లైన్‌ మోసాలు, ప్రేమ పేరుతో మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించారు. సంబంధిత పోలీసు అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులను చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను సంబంధిత పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాల్లో కూడా నమోదు చేయవచ్చని, అక్కడ స్వీకరించిన ఫిర్యాదులను సైతం పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులుగానే పరిగణించి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

భర్తపై ఫిర్యాదు

పెళ్లయిన ఏడు నెలలకే భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనను మోసం చేస్తున్నాడని ఓ మహిళ జిల్లా ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేసి కాపురాన్ని నిలబెట్టాలని తంబళ్లపల్లె మండలం గోపిదిండి దళితవాడకు చెందిన మంజునాథ్‌ భార్య సునీత(23) ఎస్పీని కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement