హంద్రీనీవా ప్రాజెక్టులో జూనియర్ డీఈఈకి 5 సబ్ డివిజన్ల అప్పగింత
ఈఈ పరిధిని మించి బాధ్యతలు కట్టబెట్టడం వెనుక పెద్ద ‘మతలబు’?
15 ఏళ్ల అనుభవం ఉన్న ముగ్గురు సీనియర్ల నెత్తిన ‘నీవా’ గుదిబండ!
సాక్షి, మదనపల్లె : ప్రభుత్వ శాఖ అయినా, ప్రైవేటు సంస్థ అయినా విధుల నిర్వహణలో సీనియార్టీకి, అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చి పనులను నాణ్యతగా చేయించుకోవడం ఎక్కడైనా ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుత కూటమి పాలనలో ఇవేమీ అక్కర్లేదు. ‘మనోడైతే చాలు.. అనుభవం గట్రా ఏమీ వద్దు.. మేం చెప్పినట్టు చేసేవాడైతే చాలు.. అదే పెద్ద సీనియార్టీ’ అన్నట్లుగా పాలకులు కొత్త భాష్యం చెబుతున్నారు. అచ్చంగా ఇదే పరిస్థితి ప్రస్తుతం హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశలో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు పనులకు సంబంధించి ఓ జూనియర్ కోసం ముగ్గురు అనుభవజ్ఞులైన సీనియర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను (డీఈఈ) బలిపశువులను చేశారు. అది కూడా పథకం ప్రకారం వారికి పనులు లేని నీవా ఉపకాలువ పనులు అప్పగించి, కీలకమైన కాంక్రీట్ లైనింగ్, స్ట్రక్చర్స్ పనుల నుంచి తప్పించేశారు.
ఏడాది డీఈఈకి ‘టాప్ ప్రయారిటీ’
హంద్రీనీవా ప్రాజెక్టులోనే పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 165 నుంచి 207.800 డివిజన్–12 పరిధిలోకి వస్తుంది. ఈ పరిధిలో పనిచేస్తున్న డీఈలు రవి, రమణారావు, సెల్వరాజ్‌లను పీబీసీ పనుల నుంచి ఉన్నతాధికారులు అకస్మాత్తుగా తప్పించారు. వీరంతా ఏఈ స్థాయి అనుభవాన్ని దాటుకుని, డీఈఈలుగానే 15 ఏళ్లకు పైగా సుదీర్ఘ క్షేత్రస్థాయి అనుభవం కలిగిన వారు. అయితే కదిరి డివిజన్–11లో ఏఈగా పనిచేస్తూ ఈ మధ్యనే డీఈఈగా పదోన్నతి పొంది, కనీసం ఏడాది అనుభవం కూడా పూర్తికాని కృష్ణకిశోర్‌కు ఈ కీలకమైన పీబీసీ కాంక్రీట్ లైనింగ్, స్ట్రక్చర్స్ పనులను కట్టబెట్టారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా హంద్రీనీవా ప్రాజెక్టులో జూనియర్‌కు అత్యధిక పనులు అప్పగించడం వెనుక కారణాలు ఏమిటన్నది ఇంజనీరింగ్ అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సర్కిల్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి రాజకీయ ఒత్తిళ్లతో తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత సాహసోపేతమని తోటి అధికారులు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు.
కేబీసీ లాగే పీబీసీ.. అంతా మతలబు!
గతంలో కుప్పం ఉపకాలువ కాంక్రీట్ లైనింగ్ పనుల విషయంలో ఉన్నతాధికారులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతోనే ఇప్పుడు పీబీసీ పనుల అప్పగింత వ్యవహారాన్ని ఇంజనీర్లు పోల్చుతున్నారు. డివిజన్–12 పరిధిలోకి వచ్చే కేబీసీలో కాంక్రీట్ లైనింగ్ పనులు చేసేందుకు ఈఈ, డీఈఈలు ఉన్నప్పటికీ, అందరినీ పక్కనపెట్టి కేవలం ఒక్క డీఈఈతోనే పనులన్నీ చేయించారు. 123 కిలోమీటర్ల కాలువ పని పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ అంతా ఒక్కరికే అప్పగించారు. ఇదే తరహాలో ఇప్పుడు పీబీసీలోనూ సీనియర్లను పక్కనబెట్టి జూనియర్‌కు బాధ్యతలు ఇవ్వడం వెనుక పెద్ద ‘మతలబు’ ఉందని ప్రాజెక్టు వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
ఎస్‌ఈకి లేఖాస్త్రం
ముందస్తు స్కెచ్.. ‘పనిలేని’ బాధ్యతలు!
డీఈఈలు రవి, సెల్వరాజ్, రమణారావులను పీబీసీ పనుల నుంచి తప్పిస్తే తర్వాత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ఉన్నతాధికారులు ముందే పసిగట్టినట్లున్నారు. అందుకే కొంత ముందస్తు జాగ్రత్తగా వీరికి ప్రాజెక్టులో అంతర్భాగమైన ‘నీవా ఉపకాలువ’ పనులను అప్పగించారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. నీవా ఉపకాలువలో పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలు ఇప్పటికీ ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి. ఆ పనులను ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేస్తుందో, క్షేత్రస్థాయిలో ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి ‘పనిలేని’ బాధ్యతలను సీనియర్లకు అప్పగించారంటే ఉన్నతాధికారుల దూరదృష్టి (రాజకీయ వ్యూహం) ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ నిధులు మంజూరయ్యే వరకు ఈ ముందస్తుగా బలైన సీనియర్లు ఎదురుచూడక తప్పదు.
పాపం.. బలిపశువులు!
డివిజన్–12కు చెందిన డీఈఈలను పీబీసీలో అప్పగించిన పనుల నుంచి తొలగించడంతో వారు పూర్తిగా బలిపశువులయ్యారు. ఒక్కో డీఈఈకి 15 ఏళ్లకు పైబడిన అనుభవం ఉన్నా, ఇప్పుడా అనుభవం ఏడాది సీనియారిటీ లేని జూనియర్ డీఈఈ ముందు అభాసుపాలైంది. వీరికి ప్రస్తుతం అటు కుప్పం కాంక్రీట్ లైనింగ్ పనుల్లోనూ బాధ్యతలు లేవు, ఇటు పుంగనూరు బాధ్యతల నుంచీ తప్పించారు. దీంతో ‘రెంటికి చెడ్డ రేవడి’లా మారి వీరికి ఎలాంటి పనిలేక కార్యాలయాల్లో ఖాళీగా కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
మా తప్పేమిటి?’ నిలదీసిన సీనియర్ డీఈఈలు
హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ బాధ్యతల నుంచి అన్యాయంగా తొలగించబడిన ముగ్గురు సీనియర్ డీఈఈలు రవి, సెల్వరాజ్, రమణారావులు ఎస్‌ఈ విఠల్ ప్రసాద్‌కు రాసిన ఫిర్యాదు లేఖ ఇరిగేషన్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఉన్నతాధికారుల ఏకపక్ష తీరును ప్రశ్నిస్తూ, తాము చేసిన తప్పేమిటని నిలదీస్తూ వారు సంధించిన ప్రశ్నలు ఇవీ..
తీవ్ర వివక్ష : కదిరి డివిజన్–9కి 50 కి.మీ పరిధి ఇస్తే, 25 ఏళ్లకు పైగా సర్వీస్, 15 ఏళ్ల డీఈఈ అనుభవం ఉన్న మాకు మాత్రం 15 కి.మీ లోపే కేటాయించారు. కనీస అనుభవం లేని జూనియర్లకు 131.200 కి.మీ ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాల్ (కేబీసీ) బాధ్యతలు అప్పగించారు.
క్లీన్ రికార్డు : ఇన్వెస్టిగేషన్, ఎగ్జిక్యూషన్, ఓ అండ్ ఎం, డిజైన్లు, టన్నెల్ పనుల్లో క్లీన్ రికార్డుతో పనిచేశాం. ఎస్‌ఈ ఆదేశాల మేరకు పీబీసీలో సైట్ సర్వేలు, ఎస్టిమేట్లు పూర్తి చేసి ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నా మమ్మల్ని పక్కన పెట్టారు.
జూనియర్‌కు ఐదు సబ్ డివిజన్లు: ఇటీవలే ప్రమోట్ అయి, ఏడాది సర్వీస్ కూడా లేని జూనియర్ డీఈఈకి ఇప్పటికే ఉన్న 2 సబ్ డివిజన్లతో పాటు, మమ్మల్ని తప్పించిన పీబీసీలోని మరో 3 సబ్ డివిజన్లను కలిపి మొత్తం 5 సబ్ డివిజన్ల బాధ్యతలు కట్టబెట్టారు. ఇది ఈఈ పరిధి కంటే ఎక్కువ.
‘పనిలేని’ చోటికి బదిలీ: మమ్మల్ని పీబీసీ నుంచి తప్పించి, ఇంకా కనీసం పరిపాలనా అనుమతులు కూడా రాని నీవా బ్రాంచ్ కెనాల్ బ్యాలెన్స్ పనులకు కేటాయించి ఉద్దేశపూర్వకంగా ఖాళీగా ఉంచారు.
స్పందన శూన్యం : తమకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకుని త్వరగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే, ఈ లేఖ అంది రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారి నుంచి ఎలాంటి సమాధానం కానీ, ప్రత్యుత్తరం కానీ లేకపోవడంతో సీనియర్ డీఈఈల ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది.


