● తల్లిదండ్రులపై ‘ప్రైవేట్’భారం
● ఈ నెల 12 నుంచి పునః ప్రారంభంకానున్న పాఠశాలలు
మదనపల్లె సిటీ : జూన్ వచ్చిదంటే తల్లిదండ్రుల్లో దడ పుడుతోంది. పాఠశాలలు ఈ నెల 12 నుంచి పునః ప్రారంభంకానున్నాయి. దీంతో పుస్తకాలు, యూనిఫాం, ఫీజుల పేరిట వారిపై అదనపు భారం పడునుంది. ప్రైవేట్‌లో ఎల్‌కేజీ,యూకేజీలకే వేలాది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చదువులకు సైతం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయినా సరే తమ పిల్లలను ప్రైవేట్‌లో ఉన్నతంగా చదివించి మంచి భవిష్యత్తు అందించాలని సామాన్యులు కలలు కంటున్నారు. ఇదే అదునుగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అందికకాడికి దండుకుంటున్నాయి. డొనేషన్లు, ఫీజుల పేరిట ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయి. జీవో నంబర్ 1–కు తూట్లు పొడుస్తూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. నామమాత్రమైన పేరెంట్ కమిటీలు పాఠశాలలకు కొమ్ముకాయడంతో ‘ఫీ’జులం సాగుతోం. విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలు మితిమీరుతున్నాయి.
అందినకాడికి దండుకోవడమే
జల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార సంస్థలుగా మారాయి. అడ్డగోలు ఫీజుల వసూలుతో పాటు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్‌లు,టై, బెల్టు, షూ ఇలాంటి ప్రతిదీ విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. బడి ప్రారంభం కాకముందే విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మరికొన్ని పాఠశాలలు వారు సూచించిన బుక్‌స్టాల్, దుస్తుల షాపుల్లోనే కొనుగోలు చేయాలని చీటీలు అందిస్తున్నారు. ఆ పుస్తకాలు మిగతా స్టోర్‌లలో దొరక్కపోవడంతో దిక్కుతోచని స్థితిలో అక్కడే అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 1వ తరగతి చదివే విద్యార్థుల నోట్, పాఠ్యపుస్తకాలకే రూ.3వేల నుంచరి రూ.5 వేల వరకు వెచ్చించాల్సిన దుస్థితి. ఇంత జరుగుతున్నా అధికారులు మామూలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యాపార సంస్థలుగా మారిన ప్రైవేట్ బడులు
జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ చదువులకే ఏడాదికి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ–టెక్నో,మోడల్, కాన్సెప్ట్, టెక్నో, గ్రామర్, ఐఐటీ, నీట్,జెఈఈ ఇలా తోక పేర్లు తగిలిస్తూ తల్లిదండ్రుల కలలను సొమ్ము చేసుకుంటన్నారు. హాస్టళ్లు కూడా ఏర్పాటు చేసి ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులకు అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదు. అయినా కొన్ని పాఠశాలలు ఇష్టారీతిన వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాఠశాలల్లో కనీస వసతులు కూడా ఏర్పాటు చేయడం లేదు. ఇరుకు గదులు, క్రీడా మైదానాలు లేకపోవడం, విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, తదతర సౌకర్యాలు లేనప్పటికి ఫీజుల వసూలులో మాత్రం వెనుకాడటడం లేదు.
అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ పాఠశాలలు తల్లిదండ్రులను దోపిడీకి గురి చేస్తున్నాయి. ప్రభుత్వం ఫీజులను అరికట్టాలి. విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో నింబధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు విక్రయిస్తున్నారు. ఎలాంటి తనిఖీలు చేయడం లేదు.
–మాధవ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి


