టమాట కిలో రూ.41 | - | Sakshi
Sakshi News home page

టమాట కిలో రూ.41

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మార్కెట్‌ యార్డ్‌లో టమాట ధర దూసుకుపోతోంది. ఐదు రోజులుగా కిలో రూ.30కి మించి పలుకుతోంది. ఆదివారం అత్యధికంగా కిలో ధర రూ.41 పలికింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఇదే టాప్‌ ధర అయింది. విక్రయానికి 991 టన్నులు వచ్చింది. శనివారం 783 టన్నులురాగా కిలో అత్యధిక ధర రూ.37 పలికింది. శుక్రవారం అయితే అత్యధిక ధర కిలో రూ.34 పలికింది. విక్రయానికి 997 టన్నుల టమాట వచ్చినప్పటికీ ధర మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడిలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ధరల్లో మాత్రం తేడా కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒక్కరోజులోనే కిలోకు రూ.4 పెరగడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

సాక్షి, మదనపల్లె : జిల్లాలో విద్యుత్‌ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిస్కం జిల్లా ఎస్‌ఈ ఆడేపూడి సోమశేఖర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్‌ ద్వారా తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. 9440817449 నంబరుకు ఫోన్‌ చేసి విద్యుత్‌ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్‌ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

సాక్షి, మదనపల్లె : స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. కిందిస్థాయిల్లో పరిష్కారంకాని ఫిర్యాదులను ప్రజలు కలెక్టరేట్‌లో జరిగే పీజీఆర్‌ఎస్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్‌లైలో కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

క్రీడలతో ఆరోగ్యం పదిలం

మదనపల్లె సిటీ : క్రీడలతో మానసికోల్లాసం, మెరుగైన ఆరోగ్యం పొందొచ్చని డీఎస్‌డీఓ చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం మదనపల్లెలోని బీటీ కాలేజీ మైదానంలో ప్రపంచ సైకిల్‌ దినోత్సవం పురస్కరించుకుని ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు, సైక్లింగ్‌ వల్ల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృఢత్వం, పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు వంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు.సైక్లింగ్‌ను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో రిటైర్డు డీఎస్‌డీఓ సయ్యద్‌బాషా, కోచ్‌లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

95 శాతం ‘సర్‌ ’

పూర్తి చేయాలి

సిద్దవటం : మూడు రోజుల్లోగా 95 శాతం ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన అధికారులను ఆదేవించారు. సిద్దవటం మండలంలోని పెద్దపల్లి గ్రామ పంచాయతీ శివునిపల్లి గ్రామంలో ఆదివారం సబ్‌ కలెక్టర్‌ బీఎల్‌ఓలు ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ చేస్తున్నారా లేదా అని క్షేత్రస్థాయిలో ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. సిద్దవటం మండలంలో ఇప్పటి వరకు 62.5 శాతం మ్యాపింగ్‌ పూర్తయిందని తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌ సబ్‌ కలెక్టర్‌కు వివరించారు.

కిచెన్‌ షెడ్డును త్వరగా పూర్తి చేయాలి

మండల కేంద్రమైన సిద్దవటంలో నిర్మిస్తున్న కిచెన్‌షెడ్డును త్వరితగతిన పూర్తి చేయాలని రాజంపేట సబ్‌ కలెక్టర్‌ భావన కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సిద్దవటం జెడ్పీ ఉన్నత పాఠశాల పక్కన నిర్మిస్తున్న కిచెన్‌ షెడ్‌ నిర్మాణ పనులను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కిచెన్‌ షెడ్‌లను నిర్మిస్తోందన్నారు. జిల్లాను పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని కిచెన్‌ షెడ్‌ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement