గరం గరం! | - | Sakshi
Sakshi News home page

గరం గరం!

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

రాజ్యసభ సీటు దక్కకపోవడంపై వాసు కినుక

సోషల్‌ మీడియాలో శ్రీనివాసులరెడ్డి పోస్టు హల్‌చల్‌

వాసును అనునయించిన తెలుగుతమ్ముళ్లు

ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు

మూకుమ్మడి రాజీనామా చేయాలనే దిశగా ఆలోచనలు

అధిష్టానం వాకబు చేయడంతో వెనక్కు తగ్గిన వైనం

సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం పార్టీ జోనల్‌ కోఆర్డినేటర్‌ ఆర్‌ శ్రీనివాసులరెడ్డికి అధిష్టానం మొండిచేయి చూపించింది. రాజ్యసభ సీటుపై పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. తుది వరకు సభ్యత్వం ఆశించి ఆపై భంగపాటుకు గురయ్యారు. వెరశి 13ఏళ్లుగా టీడీపీలో నిబద్ధతతో పనిచేస్తున్నా అధిష్టానం నిర్ణయం కలత కలిగించిందని, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం రాజకీయ జీవితంలో అత్యంత నిరాశ కలిగించిన ఘటనగా మిగిలిపోతుందని పెట్టిన పోస్టు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈపరిస్థితుల్లో కడప తెలుగుతమ్ముళ్లు గరంగరంగా వ్యవహరించారు.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యత్వం దక్కుతోందని గత కొంతకాలంగా శ్రీనివాసులరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను గమనిస్తే కారణాలేమైనప్పటికీ టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గిందనే చెప్పాలి. తొలుత జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారు.తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుల జాబితా నుంచి గెంటేశారు. జోనల్‌ కోఆర్డినేటర్‌ పదవితో మాత్రమే సరిపెట్టారు. అయినప్పటీకీ ఎలాంటి అసంతృప్తి బహిర్గత పర్చకుండా సైలెంట్‌గా ఉండిపోయినా, రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకపోవడంతో శ్రీనివాసులరెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో కడప నియోజకవర్గంలో ఆయన అభిమానులు సైతం కినుక వహించారు. మూకుమ్మడిగా రాజీనామా చేయాలనే దిశగా అనుచరులు అడుగులు వేశారు.

అధిష్టానం నిశితంగా పరిశీలన..

టీడీపీ అధిష్టానం తెలుగుతమ్ముళ్ల అడుగులను నిశితంగా పరిశీలన చేసినట్లు సమాచారం. శ్రీనివాసులరెడ్డి అనుచరుల ప్రత్యేక సమావేశం గురించి నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఆపై పొరుగున ఉన్న నేతలను సైతం పురమాయించినట్లు సమాచారం. సమావేశం వీగిపోయేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తూ అధిష్టానం డైరెక్షన్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈపరిస్థితులల్లో శ్రీనివాసులరెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని ఎవ్వరూ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయరాదని, అధిష్టానం గురించి మీడియాలో ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగుతమ్ముళ్లు అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయాలని భావించినప్పటికీ శ్రీనివాసులరెడ్డి వారిని కట్టడి చేసినట్లు సమాచారం. అందుకు కారణాలు అనేకం. సమావేశం నిర్వహిస్తే పొరుగు నేతల ప్రమేయం కడపలో పెరిగే అవకాశం లేకపోలేదు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో టీడీపీకి అన్నీ తానై వ్యవహారించిన శ్రీనివాసులరెడ్డికి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరి మద్దతు లభించడం లేదు. ప్రత్యేకించి అధిష్టానం ఎదుట శ్రీనివాసులరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలని కోరిన సందర్భమే లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుచరుల సమావేశాన్ని సైతం తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని నిఘా వర్గాలు సైతం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement