సాక్షి, టాస్క్‌ఫోర్స్ : రొంపిచెర్ల మండలంలో ఉపాధి పనులను యంత్రాలతో చేస్తున్నారు. ఉపాధి కార్యాలయానికి కిలో మీటరు దూరంలోనే.. యంత్రాలతో పనులు చేస్తున్నా అధికారులు అటు వైపు కన్నెతి చూడటం లేదు. ఈ పనులను కూలీలతో చేయించినట్లు మస్టర్లు పెట్టి ప్రభుత్వ నిధులు స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ వారణాసివారిపల్లె సమీపంలోని మంచినీళ్ల కుంట చెరువు కట్టను బల పరిచేందుకు రూ.2.50 లక్షల ఉపాధి నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇక్కడ కూలీలు చేయాల్సిన పనులను జేసీబీలు, ట్రాక్టర్లు పెట్టి.. కూలీల కడుపుకొడుతున్నారు. యంత్రాలతో పనులు చేసి కూలీలు చేసినట్లు మస్టర్లు పెట్టి నిధులను దోచుకుంటున్నారు. చెరువులకు వెళ్లే కాలువల పూడికతీత పనులను కూడా మండలంలో యంత్రాలతోనే చేస్తున్నారని ప్రజలు బహిరంగంగా చెబుతున్నారు. ఇందులో ఉపాధి అధికారుల హస్తం కూడా ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. పనులు ఎలాగైనా చేసుకోవచ్చునని అయితే తమకు 20 శాతం నిధులను ఇవ్వాలని సిబ్బంది చెప్పి నిధులను అందరూ కలసి పంచుకుంటున్నట్లు సమాచారం. కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు నిధులు చేరుతున్నట్లు తెలిసింది.
వీడియోలతో కూలీల హాజరు
ఉపాధి పనులను యంత్రాలతో చేసి కూలీలు చేసినట్లు చూపించేందుకు.. బడా నేతలు కూలీల ఫొటోలు, వీడియోలను తీసి వాటిని పనులు చేస్తున్న చోటికి తీసుకుని వెళ్లి అక్కడ ఫొటోలు, వీడియో సాయంతో కూలీలు పని చేస్తున్నట్లు జీపీఎస్‌తో హాజరు వేస్తున్నట్లు తెలిసింది. ఈ తంతు రొంపిచెర్ల మండలంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఉపాధిలో ఎలాంటి అక్రమాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లను ప్రవేశ పెట్టినా ఇక్కడ వాటి పప్పులు ఉడకడం లేదు. ఇప్పుటినా అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకుని ఉపాధిలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసినా
మారని అధికారులు
పుంగనూరు నియోజకవర్గంలో జాతీయ ఉపాధి పథకం పనులలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి 6 నెలల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు ఉపాధి పనులను తనిఖీ చేశారు. అవకతవకలు కొన్ని వెలుగు చూసినా ఉన్నతస్థాయి అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిడితో బయటికి రాకుండా అడ్డు పడినట్లు సమాచారం. ఉపాధి సిబ్బంది ఒక చోట జియో టాగింగ్ చేస్తే పనులు మరో చోట ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అక్రమాలు బయట పడకుండా సర్దేశారు. మరో మారు ఉపాధి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మిథున్‌రెడ్డి ఆధారాలతో సహాఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
యంత్రాలతో పనులు
పక్క దారి పడుతున్న నిధులు
నేతలు, అధికారులు కుమ్మక్కు
మరో సారి ఫిర్యాదు చేయనున్న ఎంపీ


