పీలేరు రూరల్ : మామిడికి కనీస గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్సీ ఎండపల్లె శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలన్నారు. మామిడి రైతులు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల నుంచి 4.5 లక్షల హెక్టార్లలో మామిడి సాగు ఉందన్నారు. ప్రతి ఏటా 45 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉత్పత్తి అవుతోందన్నారు. మామిడి గుజ్జుకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు. అయినా రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమని చెప్పారు. ఇప్పటికై నా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.


