వేర్వేరు ప్రమాదాల్లో 19 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో 19 మందికి గాయాలు

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

వేర్వేరు ప్రమాదాల్లో 19 మందికి గాయాలు

ఢీకొన్న స్కూటర్లు

మదనపల్లె టౌన్‌ : అన్నమయ్య జిల్లాలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 19 మందికి గాయాలయ్యాయి. మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని గ్రీన్‌ వ్యాలీ స్కూల్‌ వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాయచోటికి చెందిన సయ్యద్‌ ఫజులుల్లా (59), సయ్యద్‌ అబివుల్లా (38) కారులో రాయచోటి నుంచి పుంగనూరుకు సొంత పనిపై కారులో బయలుదేరారు. కారు మార్గంమధ్యలోని మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని గ్రీన్‌ వ్యాలీ స్కూల్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుంగనూరు నాగపాల్యానికి చెందిన వెల్డర్లు రహంతుల్లా, తాహీర్‌, షమీర్‌, రబ్బానీతోపాటు కారులో ఉన్న ఇద్దరు కలిపి మొత్తం ఆరుగురు గాయపడ్డారు. వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి, చికిత్సలు అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.

ఆటోను ఢీకొన్న కారు

ఆటోను కారు ఢీకొనడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గట్టు గ్రామం పట్రవారిపల్లెకు చెందిన మల్లీశ్వరి(38), తస్లీమ్‌(38)తోపాటు మరో ఐదుగురు ఆటోలో బి.కొత్తకోటకు ప్రయాణికుల ఆటోలో బయలుదేరారు. ఆటో వెళ్తుండగా గుమ్మసముద్రం చెరువు వద్ద ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఐదుగురిని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి, మల్లీశ్వరి, తస్లీమ్‌ను మెరుగైన చికిత్స కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బి కొత్తకోట పోలీసులు తెలిపారు.

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని..

కలకడ : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు అయిన సంఘటన కలకడ మండలం కె.బాటవారిపల్లె పంచాయతీ పోతువారిపల్లె సమీపంలో జరిగింది. కలకడ 108 సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరుకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి దేవితో కలిసి కలకడ నుంచి పీలేరు వైపునకు, కలకడకు చెందిన బాబాషాదిక్‌ పీలేరు నుంచి కలకడకు ద్విచక్రవాహనాలపై వెళ్తున్నారు. మార్గంమధ్యలోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోకి రాగానే ఎదురు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వారు ముగ్గురూ గాయపడ్డారు. వారిని కలకడ 108 సిబ్బంది పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చౌడేపల్లె : చౌడేపల్లె– పలమనేరు మార్గంలోని చిట్రెడ్డిపల్లె వద్ద ఆదివారం రాత్రి ఎదురెదురుగా రెండు స్కూటర్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి తొండవాడకు చెందిన శంకర(47), నాగేంద్ర(35)లు స్కూటర్‌పై చౌడేపల్లె నుంచి సోమలమండలం పెద్ద ఉప్పరపల్లె సమీపంలో గల ఆవులపల్లెలో జరిగే గంగజాతర వేడుకలకు బయలు దేరారు. పొలం వద్ద నుంచి స్కూటర్‌పై సుబ్రమణ్యం(45) వస్తున్నాడు. ఎదురెదురుగా వస్తున్న వీరి స్కూటర్లు చిట్రెడ్డిపల్లె గ్రామం వద్ద ఢీకొన్నాయి. వారు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శంకర స్పృహ కోల్పోయి, పరిస్థితి విషమంగా మారడంతో 108 సహాయంతో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement