పుంగనూరు: పున్నమి రోజు తిరువణ్ణామలైలో గిరిప్రదక్షణ సమయంలో అల్పాహారం తీసుకుంటుండగా వచ్చిన ఆలోచనతో ఆ నలుగురు మిత్రులకు గోసేవ చేయాలని నిర్ణయించారు. ప్రతి పున్నమికి ఒక లారీ లోడ్ పచ్చగడ్డి గోవులకు అందించే కార్యక్రమాన్ని పుంగనూరులో ప్రారంభించారు.
ఆలోచన ఎలా వచ్చిందంటే ....
పట్టణంలో సాధారణ కుటుంబాల్లో జన్మించిన
కెఎస్.మణి, మదన్‌మోహన్‌షేట్, గణేష్‌రెడ్డిలు వ్యాపారం చేస్తుంటారు. విద్యాసాగర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. నలుగురు మంచి మిత్రులుగా ఉన్నారు. ప్రతి పున్నమికి తమిళనాడులోని తిరువణ్ణామలై వెళ్లి గిరిప్రదక్షణం చేసి రావడం వీరికి అలవాటు. ఇలా ఉండగా మూడేళ్ల క్రితం గిరిప్రదక్షణకు వెళ్లి అక్కడ అల్పాహారం తీసుకుని అరిటాకులను కిందపడేసే సమయంలో పశువులు పరుగున వచ్చి అరటి ఆకులను తినడంతో ఆరోజు పశువులకు గడ్డి ఇవ్వాలనే ఆలోచన వారిలో మొదలైంది. గోమాతలో సకల దేవతలు కొలువైనందున బయట తీర్థయాత్రలు చేయడం ఎందుకు... పుంగనూరులోనే పశువులకు సేవ చేద్దామని నిర్ణయించారు. తమ శక్తి మేరకు చందాలు వేసుకుని మరుసటి పున్నమి నాటికి లారీ పచ్చగడ్డి కొనుగోలు చేసి బైపాస్ రోడ్డులోని ఆర్టీసీ డిపో వద్ద ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. రెండు నెలల పాటు ప్రచారం లేకపోవడంతో గడి పంపిణీ కష్టతరమైంది. ప్రస్తుతం ప్రచారం ఊపందుకోవడంతో లారీ లోడు పచ్చగడ్డి గంటల్లో తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా పశువులు సైతం పున్నమి రోజున అక్కడికి వచ్చి పచ్చగడ్డి తినడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ధరలతో పనిలేదు
నలుగురు మిత్రులు ప్రతి నెల చందాలు వేసుకుని గడ్డి ధర ఎంత ఉన్నా లారీ లోడు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం సుమారు రూ.10 వేలకు పైగా విలువ చేసే పచ్చిగడ్డి పున్నమి రోజు పశువులకు ఉదయం నుంచి అందిస్తారు. పశువుల యజమానులు, వీధి పశువులు సైతం ఆహారం కోసం తాటిమాకులపాళెంలోని ఆర్టీసి డిపో వద్దకు చేరిపోతున్నాయి. యజమానులు తమకు కావాల్సిన గడ్డిని వాహనాలు, ఆటోల్లో తీసుకెళ్తారు. ప్రతి నెల లక్షలాది రూపాయలు పశువుల ఆహారం కోసం తమ ఆదాయాన్ని కేటాయిస్తూ, గోమాతల సేవలో తరిస్తున్న నలుగురు మిత్రులు పట్టణంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరి మన్ననలు పొందుతున్నారు.
పున్నమి రోజు గడ్డి అందజేత
ఆదర్శంగా నిలుస్తున్న మిత్రులు


