చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ దేవస్థానం వద్ద ఫొటో షాపు నిర్వాహకుడు, భక్తుల మధ్య మాటకుమాట పెరిగి వివాదం తారా స్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకొనే పరిస్థితికి వెళ్లిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు బోయకొండ దేవస్థానం వద్ద ఫొటోలు తీసే నిర్వాహకుడితో గొడవపడ్డారు. ఇరువర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో ఆలయ సిబ్బంది జోక్యం చేసుకొని వివాదాన్ని సర్దుబాటు చేశారు. ఈ విషయమై ఈఓ ఏకాంబరంను వివరణ కోరగా.. ఇరువర్గాల నడుమ ఘర్షణ జరిగింది వాస్తమేనని, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు షాపు నిర్వాహకుడికి హెచ్చరిక చేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగినా.. ఆలయ ఈఓ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
మదనపల్లె టౌన్ : వృద్ధుడిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మనచెరువు పంచాయతీ దండువారిపల్లెకు చెందిన గంగులయ్య (63) ఇంటి ముందు నిలుచొని ఉండగా, ఎక్కడి నుంచో వచ్చిన పిచ్చి కుక్క ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గంగులయ్యను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
పులిచెర్ల(కల్లూరు): ట్రాక్టరు కింద పడి డ్రైవర్ దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం కల్లూరు సమీపంలోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు... కల్లూరు– చిత్తూరు జాతీయ రహదారిలో కల్లూరు సమీపంలో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ పక్కన మామిడి కాయల ర్యాంప్ పైకి పాకాల మండలం అడుసుపల్లెకు చెందిన డ్రైవరు రాజశేఖర్(35).. ట్రాక్టరు ఇంజిన్‌ను తిప్పుకొని వస్తామని వెళ్లాడు. తిరిగి వస్తుండగా అదుపు తప్పి దాని కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.
కల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
మదనపల్లె టౌన్ : అనారోగ్యం తాళలేక వృద్ధురాలు ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. మదనపల్లె మండలం నడింపల్లి పంచాయతీ జంగాలపల్లికి చెందిన గంగప్ప భార్య మునెమ్మ (80) అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెంది, ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


