పాముకాటుతో దంత వైద్యురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో దంత వైద్యురాలు మృతి

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

పాముకాటుతో దంత వైద్యురాలు మృతి బాలుడికి తీవ్ర అస్వస్థత

గాలివీడు : మండల పరిధి కరిమిరెడ్డిగారిపల్లెకు చెందిన దంత వైద్యురాలు గొట్టివీటి శివనాగమణి(34) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గొట్టివీటి శ్రీరాములు, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె అయిన శివనాగమణి బీడీఎస్‌ విద్యను పూర్తి చేసి గుర్రంకొండ, తంబళ్లపల్లి, గాలివీడు ప్రాంతాల్లో ప్రైవేట్‌ దంత వైద్యశాలలను నిర్వహిస్తూ వైద్య వృత్తిలో స్థిరపడింది. వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకున్న అనంతరం తండ్రి సంరక్షణలో స్వగ్రామంలో నివసిస్తోంది. ఈ నెల 3వ తేదీ రాత్రి ఇంటి ఆవరణలో ఉండగా ఆమెను పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు రాయచోటిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందినప్పటికీ, విష ప్రభావం శరీరంలోని కీలక భాగాలకు వ్యాపించడంతో శనివారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శివనాగమణి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మదనపల్లె టౌన్‌: పాము కాటేయడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మద్దినాయునిపల్లెకు చెందిన దిలీప్‌(12) ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా విష సర్పం కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. దీంతో బాలుడిని తిరుపతికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement