యువకుడి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

యువకుడి దారుణ హత్య

మైదుకూరు : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా మైదుకూరులోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం సంపంగి నాగేంద్ర(37) అలియాస్‌ నాగేంద్రబాబు అలియాస్‌ పెద్ద షకీలా అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మైదుకూరు అర్బన్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన నాగేంద్ర ఆటో డ్రైవర్‌గా, బేల్దారిగా పని చేస్తుంటాడు. ఆయనకు ఖాజీపేట మండలం నాగసానిపల్లెకు చెందిన జ్యోతి అనే యువతితో వివాహం అయింది. వీరికి ఆరేళ్ల నయనిక అనే కుమార్తె ఉంది. రోజూ మద్యం తాగుతుండటంతో జ్యోతి నాగేంద్రతో గొడవపడి రెండు నెలల కిందట పుట్టింటికి వెళ్లింది. మద్యం తాగాక నాగేంద్ర రోజూ కాలనీలోని గుడి ఆవరణలో ఉన్న అరుగుపై పడుకునేవాడు. కాలనీకే చెందిన గాలి సుదర్శన్‌రెడ్డి అనే యువకుడితో కలిసి తిరిగేవాడు. సుదర్శన్‌రెడ్డి తల్లి గురించి నాగేంద్ర చెడుగా ప్రచారం చేసేవాడు. తన తల్లిపై దుష్ప్రచారం మానుకోకపోతే నాగేంద్రను ఎప్పుడైనా చంపుతానంటూ సుదర్శన్‌రెడ్డి చెప్పేవాడు. ఆ ప్రకారమే శనివారం రాత్రి గుడి ఆవరణలోని అరుగుపై నిద్రపోతున్న నాగేంద్రపై ఆదివారం తెల్లవారుజామున సుదర్శన్‌రెడ్డి మచ్చుకత్తితో దాడి చేసి ముఖంపై పలుమార్లు నరికాడు. దాంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన నాగేంద్ర తమ్ముడు నాగేంద్ర ప్రసాద్‌ అలియాస్‌ చిన్న షకీలా.. సుదర్శన్‌రెడ్డి తన అన్నను నరుకుతున్నాడని చూసి గట్టిగా కేకలు వేసి వెంబడించగా అతను పారిపోయాడు. నాగేంద్ర ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు అర్బన్‌ సీఐ కె.రమణారెడ్డి కేసు నమోదు చేసి సుదర్శన్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement