మదనపల్లెటౌన్: ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మనిషికి కొండంత అండగా నిలిచేది కేవలం కుటుంబమే అని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌శ్రీను అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవిత ప్రయాణంలో మనసును, ఆత్మగౌరవాన్ని, కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేయకూడదని హితవు పలికారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలకు దారితీస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దలను కాదని పిల్లలు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పడొద్దని చెప్పారు. ఈ క్రమంలోనే చిన్న చిన్న కారణాలతో విడిపోతున్న కుటుంబాలను కలిపేందుకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉమెన్ వింగ్ పోలీసులతో కౌన్సెలింగ్ ఇప్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమెన్ వింగ్ సీఐ శంకర మల్లయ్య, రాజారెడ్డి, మహమ్మద్ రఫి, కళా వెంకటరమణ ఎస్‌ఐ గాయత్రి, రహీముల్లా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మహిళా చైతన్యానికే 2కే వాకథాన్
ఆడబిడ్డల రక్షణే ప్రథమ కర్తవ్యంగా, వారి ఆత్మగౌరవానికి అండగా నిలిచేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. మహిళా భద్రతపై సమాజంలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మదనపల్లె పట్టణంలో 2కే వాకథాన్ నిర్వహించనున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలసి ఆవిష్కరించారు. ఆదివారం ఉదయం 7గంటలకు మిషన్‌కాంపౌండ్ నుంచి బీటీ కళాశాల మైదానం వరకు వాకథాన్ ఉంటుందని తెలిపారు. మదనపల్లె పోలీసుల ఆధ్వర్యంలో, శక్తి టీమ్ సమన్వయంతో సాగే ఈచైతన్య యాత్రలో పాల్గొనే వారికి తాగునీరు, అల్పాహార వసతి కల్పించారు. పాల్గొన్న వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 10 ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి


