ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సు
రాజంపేట : అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో రెండురోజుల పాటు రాష్ట్ర వైద్య విజ్ఞాన సదస్సుకు శనివారం శ్రీకారం చుట్టారు. రాజంపేట–రాయచోటి రహదారిలోని తిరుమల కన్వన్షెన్ సెంటర్‌లో సదస్సు నిర్వహించారు. సదస్సుకు తొలిరోజు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ బన్సాలి, మాజీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వినయ్ అగర్వాల్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం పాల్గొన్నారు. నేటి సమాజంలో విజృంభిస్తున్న వ్యాధులు, నివారణోపాయాలతోపాటు కొత్తరకమైన జబ్బులు తదితర అంశాల గురించి ఆయా రంగాల్లో నిష్ణాతులైన వైద్య నిపుణులు ప్రసంగించారు. ఐఎంఏ ప్రతినిధులైన డాక్టర్లు సుధాకర్, విజయకుమార్, చలమయ్య, వీరయ్య, సునీల్, శ్రీహరి, అనిల్, నవీన్, మధుసూదన్‌లతోపాటు పలువురు ఐఎంఏ సభ్యులు సదస్సు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించారు.


