వణికిస్తున్న చలి
రాజంపేట టౌన్: చుర్రుమనే ఎండలకు.. వేసవిని తలపించే ఉక్కబోతకు బ్రేక్ పడింది. చలిపులి పంజా విసురుతోంది. మంచు కూడా కురుస్తుండటంతో ప్రజలు చలిని తట్టుకోలేక గజగజ వణుకుతున్నారు. ఉదయం వేళల్లో వ్యాపారం, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలకు పడిపోయాయి. దీనికి తోడు రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో చలి మరింత ఎక్కువైంది. మరో మూడు నెలలు చలితీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు ఉన్ని దుస్తులు కొనుగోలు చేస్తున్నారు.
● శీతాకాలం రానే వచ్చింది. సాయంత్రం ఆరు గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఇక ఉదయం వేళల్లో మంచు తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. చలికాలం ప్రారంభం కావడంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉన్ని వ్యాపారులు వెచ్చని స్వెటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేశారు.వీరు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకొని మూడు నెలల పాటు ప్రజలతో మమేకమై వ్యాపారాలు సాగిస్తారు. రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చిన వీరు ఈప్రాంత ప్రజల సహకారంతో ప్రతి ఏటా వ్యాపారం చేసుకొని వెళ్లిపోతారు. కొంతమందికి పూర్తిగా తెలుగు రాదు, అలాగే ఇక్కడి ప్రజల్లో కొంత మందికి హింది రాదు. అయినప్పటికి పరస్పర సహకారంతో వ్యాపారం సాగిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
ఆ వ్యాపారుల వద్దే...
ప్రస్తుతం చాలా వస్త్ర దుకాణాల్లో దుస్తులతో స్వెటర్లు సైతం విక్రయిస్తారు. అలాగే ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా దుస్తుల కొనుగోలు జోరుగా సాగుతోంది. అయితే ఉన్ని దుస్తులను రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వ్యాపారుల వద్దే కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణంలో మార్పులు రావడం.. చలి పెరగడంతో వెచ్చని దుస్తులకు డిమాండ్ పెరిగింది. ఈకారణంగా జిల్లాలో ఇతర రాష్ట్రాల వారు ఏర్పాటు చేసిన ఉన్ని దుస్తుల దుకాణాల్లోనే స్వెటర్లు, మంకీక్యాప్‌లు, రెయిన్‌కోట్లు, బెడ్‌షీట్లు వంటి వాటిని ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఉన్ని దుస్తులు నాణ్యతను బట్టి రేట్లు ఉన్నాయి. స్వెటర్ల ధరలు సైజును బట్టి రూ. 400 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి. రెయిన్ కోట్లు రూ.800 నుంచి రూ. 1500 వరకు, డబుల్ బెడ్‌షీట్లు రూ. 400 నుంచి రూ. 800 వరకు, మఫ్లర్లు రూ. 100 నుంచి రూ. 300 వరకు విక్రయిస్తున్నారు.
పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
ఇబ్బంది పడుతున్న ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
చలికాలంలో వ్యాధులు సోకే అవకాశం ఉంది. వేకువ జామున బయటకు వెళ్లే కూరగాయల, పాల వ్యాపారులు, వాకింగ్ చేసే వారు విధిగా స్వెటర్లు , మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు చలిబారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే వ్యాధులు దరి చేరవు.
– పాలనేని వెంకటనాగేశ్వరరాజు, సూపరిండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట
బాగా ఆదరిస్తున్నారు
మేము ఇతర రాష్ట్రాల నుంచి వస్తాం. మాలో కొంత మందికి ఇక్కడి భాష రాదు. ఇక్కడి ప్రజలకు మా భాషరాదు. పొట్టకూటి కోసం రాష్ట్రంకాని రాష్ట్రం వచ్చిన తమను తెలుగు ప్రజలు అనేక సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. మావద్ద ఉన్ని దుస్తులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తెలుగు ప్రజలు మంచి మనస్సున వారు. – గాశీరాం, ఉన్ని దుస్తుల వ్యాపారి, మధ్యప్రదేశ్
వణికిస్తున్న చలి
వణికిస్తున్న చలి
వణికిస్తున్న చలి


