కుప్పకూలిన ‘చీర’కాల బంధం !
చిరు వ్యాపారి హఠాన్మరణంతో
కంట తడిపెట్టిన మహిళలు
కురబలకోట : అతను బంధుమిత్రుడు కాదు. రక్త సంబంధం అసలే లేదు. ఇతను నాయకుడు కూడా కాదు..అయినా అతను చనిపోతే గ్రామంలోని మహిళలు శనివారం కంట తడిపెట్టారు. మరి ఎందుకు ఇంత మంది కంటతడిపెట్టారంటే బంధం లేని బంధువుగా నిలవడమే. అంగళ్లు గ్రామస్తుల కథనం మేరకు వివరాలలోకి వెళితే.. కదిరికి చెందిన మునాఫ్ (51) కురబలకోట, అంగళ్లు తదితర ప్రాంతాల్లో 20 ఏళ్లుగా చీరల వ్యాపారం చేసేవాడు. బ్యాగులో వీటిని భుజాన వేసుకు వచ్చి పల్లెలు తిరుగుతూ అమ్మేవాడు. అమ్మా.. ఈ చీర మీకు బాగుంటుంది.. అక్కా ఈ చీర డిజైన్ మీకు సరిపోతుంది..అని చెబుతూ మహిళల మనసు గెలిచాడు. ఇతను చీరలు తెస్తే చుట్టూ మూగేవారు. పండగ, వేడుకలకు ఇతని వద్దే చీరలు కొనేవారు. డబ్బులు లేని వారికి అప్పు కూడా ఇచ్చేవాడు. గట్టిగా అడిగేవాడు కూడా కాదు. దీంతో మంచి మనిషిగా పేరు పొందాడు. వ్యాపారం కూడా నిజాయితీగా చేసేవాడు. ఇలాంటి వ్యక్తి యథావిధిగా చీరల బ్యాగుతో శనివారం కదిరిలో అంగళ్లుకు బస్సులో బయలు దేరాడు. అంగళ్లు బస్టాండులో బస్సు దిగగానే ఛాతీలో నొప్పి వచ్చింది.. కళ్లు బైర్లు కమ్మాయి. హార్ట్ అటాక్ వచ్చింది. నిల్చున్న చోటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇతని గురించి స్థానికంగా తెలిసిన వారు కదిరిలోని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు అంబులెన్స్‌లో ఇతన్ని స్వగ్రామం కదిరికి తీసుకెళ్లారు. మనిషికి విలువ డబ్బు హోదాతో మాత్రమే కాదు. మంచి మనసు, నోటి మాటతో కూడా వస్తుందని నిరూపించాడు మునాఫ్.
కుప్పకూలిన ‘చీర’కాల బంధం !


