ప్రియురాలిపై అనుమానంతో కడతేర్చాడు
మదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం పంచాయతీలో దారుణంగా హత్యకు గురైన ఒంటరి మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె ప్రియుడే.. అనుమానంతో కడతేర్చినట్లు పోలీసు విచారణలో తేలింది. హత్యకేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు... ఐదు రోజుల్లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. డీఎస్పీ మహేంద్ర హత్యకు దారి తీసిన పరిస్థితులను వివరించారు. మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ పాకాలమందవీధికి చెందిన సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ(45) ఒంటరి మహిళ. భర్త అర్జునరావు ఐదేళ్ల క్రితం మరణించారు. ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. భర్త మరణించిన తర్వాత సావిత్రమ్మ అన్నదమ్ములతో కలిసి నివసిస్తోంది. వీధినాటకాలు, హరికథలు చెప్పుకుంటూ జీవించేది. ప్రోగ్రామ్స్ లేనప్పుడు మేసీ్త్రల వద్దకు కూలి పనులకు వెళ్లేది. ఈ క్రమంలో సీటీఎం పంచాయతీ చిన్నాయనచెరువుపల్లెకు చెందిన మేసీ్త్ర మంజునాథ వద్దకు కూలిపనులకు వెళుతూ, అతనితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఇద్దరూ తరచూ ఫోన్లలో మాట్లాడుకుంటూ, మంజునాథ్ సావిత్రమ్మకు అన్ని విషయాల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సావిత్రమ్మను, మంజునాథను మందలించారు. దీంతో సావిత్రమ్మ, కూలిపనులకు మంజునాథ వద్దకు కాకుండా వేరే వారి వద్దకు వెళ్లసాగింది. సావిత్రమ్మ తనను వదిలేసి వేరొకరితో వివాహతేర సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకున్న మంజునాథ ఆమెను చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం నవంబర్ 16న రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో సావిత్రమ్మకు ఫోన్‌చేసి పాకాలమందవీధికి దగ్గరలోని బీడుభూమి వద్దకు రావాల్సిందిగా కోరాడు. ఒంటరిగా అక్కడకు వచ్చిన సావిత్రమ్మతో మంజునాథ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మంజునాథ పట్టరాని ఆవేశంతో...సావిత్రమ్మ ఒంటిపై కప్పుకుని వచ్చిన టవల్‌ను తీసుకుని, తన వంటిపై ఉన్న టవల్‌తో కలిపి గొంతుకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ప్రియురాలు చనిపోయిందని నిర్ధారించుకున్నాక, ఘటనాస్థలానికి కొద్దిదూరంలో నిలిపి ఉంచిన తన హోండా యాక్టివా మోటార్ సైకిల్‌లో అక్కడి నుంచి మంజునాథ వెళ్లిపోయాడు. 17వ తేదీ ఉదయం సావిత్రమ్మ సోదరుడు సుదర్శన ఫిర్యాదుమేరకు హత్యకేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట సావిత్రమ్మ కుమారుడు ఆదిత్యపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, విచారణలో అతడి ప్రమేయం లేదని తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, మృతురాలి ఫోన్ కాల్స్, సాంకేతిక ఆధారాలతో ప్రియుడు మంజునాథ హత్య చేసినట్లుగా గుర్తించారు. శుక్రవారం సాయంత్రం మదనపల్లె మండలం కొండామర్రిపల్లె పంచాయతీ మదనపల్లె–తిరుపతి మెయిన్‌రోడ్డు, యర్రగానిమిట్ట టిడ్కో ఇళ్ల సమీపంలో మంజునాథను అరెస్ట్ చేశారు. టూవీలర్ వాహనంతో పాటు సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. వైద్యపరీక్షల అనంతరం నిందితుడిని రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. సీటీఎం ఒంటరి మహిళ హత్య కేసును ఛేదించడంలో సీఐ కళావెంకటరమణ, ఎస్‌ఐ గాయత్రి, ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచారని డీఎస్పీ మహేంద్ర అభినందించారు.
ఒంటరి మహిళ హత్య కేసులో
వీడిన మిస్టరీ


