
వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి
– కాలిబూడిదైన గణేష్ మండపం
పీలేరు : వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని బీవీ రెడ్డి నగర్ సమీపంలో ఎల్‌బీఎస్ రోడ్డులో స్థానిక భక్తులు గణేష్ మండపంలో విగ్రహం ఏర్పాటు చేసి పూజలు ప్రారంభించారు. అయితే దీపం ఒరిగి ఒక్కసారిగా మండపానికి మంటలు వ్యాపించి పూర్తిగా కాలిబూడిదైంది. అనంతరం భక్తులు ఆ స్థానంలో కొత్త విగ్రహం, మండపం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.
ముగ్గురికి గాయాలు
ములకలచెరువు : ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గరికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... కొండ కింద రైల్వేగేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పెద్దపాళ్యం పంచాయతీ రామానాయునికోటకు చెందిన చౌడప్ప(50), దేవలచెరువు పంచాయతీ గోళ్లారిపల్లెకు చెందిన శైలజ(17), మమత(15)లకు తీవ్రగాయాలయ్యాయి. 108 సహాయంతో వీరిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోడమీద పడి రైతుకు గాయాలు
మదనపల్లె రూరల్ : వర్షానికి తడిసిన గోడ మీద పడి రైతు గాయపడిన ఘటన గురువారం ములకలచెరువు మండలంలో జరిగింది. దేవలచెరువు పంచాయతీ చెన్నువారిపల్లెకు చెందిన మల్లారెడ్డి కుమారుడు భాస్కరరెడ్డి(36) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆవుల కొట్టంలో పనులు చేస్తుండగా, వర్షానికి తడిసిన గోడ ఒక్కసారిగా మీదపడడంతో గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు.

వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి

వినాయక చవితి ఉత్సవాల్లో అపశృతి