
మట్టి విగ్రహాలనే వినియోగించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : వినాయక చవితి పండుగలో ప్రజలు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్‌తో కలిసి గణేష్ నవరాత్రి వేళ పర్యావరణహిత మట్టి విగ్రహాలు వినియోగంపై కలెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వాడటం వల్ల చెరువులు, నదులు కాలుష్యం అవుతున్నాయన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు.
సమస్యలకు సత్వర పరిష్కారం
రాయచోటి టౌన్ : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.అనంతరం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో నిశితంగా అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.
శాంతియుతంగా వినాయక చవితి
జరుపుకోవాలి:జేసీ
రాయచోటి : వినాయక చవితి పండుగ సామరస్యానికి ప్రతీక అని, పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా సంబంధిత అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిలతో కలిస జాయింట్ కలెక్టర్ శాంతియుత కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలు శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని జేసీ సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలు ఉపయోగించకుండా మట్టి వినాయకులను ప్రోత్సహించాలని నిర్వాహకులను కోరారు. నిమజ్జన ఘాట్ల వద్ద లైటింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, రక్షణ బృందాలు వంటి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు,మతపెద్దలు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి