
దరఖాస్తుకు నేడు చివరి తేదీ
రాజంపేట : రాజంపేట అబ్కారీశాఖ పరిధిలో రెండు బార్‌ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవడానికి మంగళవారం చివరి రోజని రాజంపేట అబ్కారీశాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మల్లిక తెలిపారు. సోమవారం ఇక్కడ మాట్లాడుతూ చివరిరోజున డీడీల రూపంలో బ్యాంకుల ద్వారా, డిపాజిట్ చేసుకోవాలన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
రాయచోటి జగదాంబసెంటర్ : ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 28వ తేదీ నుంచి సంబంధిత జిల్లాల్లోనే ప్రారంభమవుతుందని మెగా డీఎస్సీ–2025 కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం నుంచి కాల్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఒక రైతుకు ఒక బస్తా
మదనపల్లె : మదనపల్లెలో యూరియా కోసం వచ్చిన రైతులకు వ్యవసాయశాఖ అధికారులు ఒక రైతుకు ఒక బస్తాను పంపీణీ చేయాలని డీలర్లను కోరారు. సోమవారం మదనపల్లె ఎరువుల దుకాణాల వద్ద రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో బస్తా యూరియా కోసం క్యూలో నిలబడి తీసుకెళ్లారు. రైతులకు అవసరమైనంత యూరియా ఉందని, అయితే ఒకేసారి తీసుకువెళ్లడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని వ్యవసాయశాఖ ఏఓ నవీన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఒక పంటకు ఒక విడతకు ఒక బస్తా యూరియా సరిపోతుందని చెప్పారు.
ఉపాధ్యాయుల బదిలీ అర్హత నిబంధన సవరణ
రాయచోటి జగదాంబసెంటర్ : పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల అర్హత నిబంధనలలో సవరణలు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు కనీసం 2 సంవత్సరాల సేవ పూర్తి చేయాలనే షరతు మినహాయించినట్లు, ఈ నేపథ్యంలో సేవా పరిమితి అవసరం లేదన్నారు. అదే విధంగా వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న పరస్పర మార్పిడి బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వారికి 31.07.2027లోపు పదవీవిరమణ పొందబోయే వారు అంతర్ జిల్లా బదిలీలకు అర్హులు కారని గమనించాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఈ నెల 24 నుంచి 27వ తేదీల వరకు, ఎంఈఓ వెరిఫికేషన్ ఈ నెల 25 నుంచి 28 వరకు, డీఈఓ వెరిఫికేషన్ ఈ నెల 26 నుంచి 29 వరకు, పాఠశాల విద్య డైరెక్టర్‌కు సమర్పణ ఈ నెల 30 నుంచి 31వ తేదీ వరకు, డైరెక్టర్ కార్యాలయ పరిశీలన సెప్టెంబర్ 1 నుండి 2వ తేదీ వరకు ఉంటుందని డీఈఓ తెలియజేశారు.