
ఒంటిమిట్ట రామాలయంలో పవిత్రాల సమర్పణ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతారామలక్ష్మణుల ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉదయం బాలబోగం, చతుష్టానార్చన, పవిత్రహోమం, మధ్యాహ్నం ఆరాధన, శాత్తుమొర, తీర్థప్రసాద గోష్టి చేపట్టారు. అనంతరం ఉదయం 9 గంటలకు శ్రీ సీతాసమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, విశ్వక్సేనులవారికి, ధ్వజస్తంభానికి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి ప్రశాంతి, సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.