
సైబర్ చట్టాలపై అవగాహన అవసరం
మదనపల్లె రూరల్ : సైబర్ చట్టాలపై న్యాయవాదులు అవగాహన కలిగి ఉండాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ వి.రాధాకృష్ణ కృపాసాగర్ అన్నారు. పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అండ్ సైబర్ లాపై వర్క్‌షాపు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లను శిక్షించడం, హానికరమైన ఆన్‌లైన్ కార్యకలాపాల నుంచి ప్రజలను రక్షించడం, డిజిటల్ డేటాను భద్రపరచడం సైబర్ చట్టాల ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి. వాటిని నిరూపించాలంటే ఏఏ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇచ్చే సాక్ష్యాలు చెల్లుబాటు అవుతాయా లేదా..? ఏఏ పద్ధతుల్లో వాటిని నిరూపిస్తే చెల్లుబాటవుతాయి. వాటిపై వచ్చే అభ్యంతరాలను ఎలా నివృత్తి చేయాలనే అంశంపై న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. అనంతరం మదనపల్లె బార్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ వి.రాధాకృష్ణ కృపా సాగర్‌ను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి సూర్యనారాయణమూర్తి, న్యాయమూర్తులు శ్రీలత, సుభాన్, శిరీష, కీర్తన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అమరనాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.మనోహర, ఉపాధ్యక్షులు ఎ.వి.శివకుమార్‌రెడ్డి, రెడ్డి నాగులు, ఎం.ఎ.బాషా, అహ్మద్ నజీరుద్దీన్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి
డాక్టర్.వి.రాధాకృష్ణ కృపా సాగర్