
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
కలకడ: స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పిలుపునిచ్చారు. శనివారం కలకడ మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర‘ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.జూలై చివరి వారం నుంచి జిల్లాలో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. నీరు నిల్వ ఉంటే దోమలు, ఇతర కీటకాలు విస్తరించి మలేరియా, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీజనల్ , అంటువ్యాధులను నివారించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావడం అత్యవసరమని కలెక్టర్ తెలిపారు.ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ గా పాటించాలని తెలిపారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమ అమలుపై ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కలకడ నుంచి తిరిగి వెళుతూ చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై యూనియన్‌బ్యాంక్–కలకడ శాఖ ముందు భాగంలో మురుగునీరు నిల్వ ఉండటం చూసిన కలెక్టర్ జాతీయరహదారి అధికారులకు వెంటనే సమాచారం అందించి తొలగించాలని డిప్యూటీ ఎంపీడీఓ ప్రతాప్‌రెడ్డిని ఆదేశించారు. నీటిలో లార్వాలు వృద్ధి చెందకుండా మలాథియాన్ పిచికారి చేశారు. ఈకార్యక్రమంలో తహాసీల్దార్ మహేశ్వరిబాయ్, సీఐ లక్ష్మన్న, డిప్యూటీ ఎంపీడీఓ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు ప్యారీజాన్, విశ్వనాథ, ఎంఈఓ మునీంద్రనాయక్,జావాద్, జిలానీ, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి