
ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకుకార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడురోజులపాటు పవిత్రోత్సవాలు జరుపుతుంటారు. పవిత్రోత్సవాలలో భాగంగా ఆగస్టు 24న యాగశాలలో పవిత్ర ప్రతిష్ట, శయానాధివాసం, 25న పవిత్ర సమర్పణ, 26న వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నవీన్, అర్చకులు పాల్గొన్నారు.