
వైద్య కళాశాలను ప్రారంభించాలి
మదనపల్లె : కూటమి ప్రభుత్వంలో మదనపల్లె వైద్య కళాశాల నిర్మాణం కాసుల కోసమే ఆగిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వ వైఖరితో రూ.72 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందన్నారు. శనివారం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు, సీపీఎం నాయకులతో కలిసి మదనపల్లెలో ఆగిపోయిన కళాశాల భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023లో పనులు పూర్తిచేసి 2024 లో కళాశాలను ప్రారంభించాల్సి ఉండిందన్నారు. మదనపల్లెలో రూ. 472 కోట్లతో నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే పూర్తిగా నిర్మాణాలను ఆపేసి కళాశాలను ప్రారంభించలేదన్నారు. నిర్మాణ ప్రాంతంలో రూ.10 కోట్ల విలువైన సామగ్రి దుస్థితికి చేరిందన్నారు. వైద్య కళాశాల ప్రారంభం కోసం రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఆందోళనకు సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు హరిశర్మ, రామకృష్ణ, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.